శరీరజనితరక్షణశక్తి.
103
జెన్నరు చూపిన మార్గమున ననుసరించి ఇప్పటివైద్యులు అనేకములయిన అంటువ్యాధులకు టీకాలు వేయు పద్ధతిని కనిపట్టియున్నారు. ఇంక ననేకవ్యాధులవిషయమై యింకను గట్టి ప్రయత్నములు చేయుచున్నారు. దీని కంతకును జెన్నరే మూలపురుషుడు. వందనీయుడగు మహాత్ముడు. జెన్నరు టీకాలు కనిపట్టినతరువాత ‘వేలకొలది మైళ్లదూరములోనున్న అమెరికా మొదలగు ఖండాంతరములకు ఈ టీకారసములను ఎట్లు పంపుట? ఇది యనేకదినములు నిలిచియుండదుగదా?’ అని యొక గొప్ప సంశయము కలిగెను. అంతట వారీ క్రింది యుక్తిని పన్నిరి. ఆ కాలములలో పడవలు ఇప్పటివలే యంత్ర శక్తిచే వారముకను వేలకొలదిమైళ్లు పరుగెత్తునవికావు. అప్పుడొక చిన్న ప్రయాణమనిన ఆరుమాసములు పట్టెడిది. అప్పటి పుణ్యాత్ములు కొందరు దండు కట్టుకొని ఇరువది లేక ముప్పది చంటిబిడ్డలను తగినంతమంది వైద్యులను, దాదులను చేర్చుకొని టీకారసమును కొని పోవుటకు ఖండాంతర ప్రయాణమునకై ఓడ నెక్కుదురు. వారితోకూడ నొకరిద్దరు పిల్లలకు టీకాలు వేసి తీసికొనిపోవుదురు. ఎనిమిది దినములయినతరువాత నీ యిద్దరు పిల్లలనుండి మరిద్దర కీ చీమునుమార్చుదురు. ఇట్లు వారము వారమునకు మిక్కిలి జాగ్రత్తతో మార్చుకొనుచు వాని బలము తగ్గిపోకుండ నెలల తరబడి కాపాడుచు తమ గమ్యస్థానమును చేరుదురు. ఇట్లా దినములలో ననేక కష్టముల కోర్చి ప్రపంచమంతటకు నీ టీకారసమును వ్యాపింపజేసిరి.