పుట:AntuVyadhulu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

పదియవ ప్రకరణము


సూక్ష్మజీవులచే నదివరకే పుట్టియున్న విషములను విరిచివేయును. ఇది రక్తమునందుగాని శరీరమునందుగాని, అధికమగు మార్పును కలుగజేయదు. దీనివలన రక్షణశక్తి సామాన్యముగ 15దినములకంటెహెచ్చుగనుండదు. అంటువ్యాధులలో కొన్ని సూక్ష్మజీవుల మూలమునను కొన్ని వాని విషముల మూలమునను రోగిని వధించునని చెప్పియుంటిమి. రక్షణశక్తి కూడ సూక్ష్మజీవులవలన గలుగు నపాయమునుండి రక్షించుశక్తియు, వాని విషములను విరిచివేయ తగిన రక్షణ శక్తియు అని రెండు విధములగు రక్షణశక్తి కలిగింప వచ్చుననియు చెప్పియుంటిమి. ధనుర్వాయువునందు, రోగిశరీరమునందు పుట్టు విషములకు విరుగుడుపదార్థములు గుర్రముయొక్క నెత్తురు నందలి రసములో పుట్టించి ఆ రసమును రోగియొక్క శరీరములోని కెక్కించి వానివలన సూక్ష్మజీవుల విషములను విరిచివేసి రోగము కుదుర్చుచున్నారు. కలరా, టయిఫాయిడు జ్వరములలో నిట్లుగాక వ్యాధి సూక్ష్మజీవులచేతనే కలుగుచున్నందున నితర జంతువుల శరీరములోనికి ఆయా సూక్ష్మజీవుల నెక్కించి వానిరక్తములోనుండి సూక్ష్మజీవనాశకమగు రసముతీసి దాని రోగియొక్కశరీరములోనికి బోలుసూదిగుండ ఏక్కింతురు. దీని వలన రోగిశరీరమునందలి సూక్ష్మజీవులుచచ్చి రోగికి ఆరోగ్యముకలుగవచ్చును. ఇందుచే రోగిశరీరములో చచ్చిన సూక్ష్మ జీవులనుండి పుట్టువిషపదార్థము లట్లేయుండి యొకానొప్పుడు రోగి కపాయముగలిగింపవచ్చును.