86
తొమ్మిదవ ప్రకరణము
2. ఆమ్లాకర్షణములు. (Eosinophill Leucocyte) ఇందు గుండ్రమైనట్టికాని, పలవలు గలయట్టికాని జీవస్థానము లుండును. మూలపదార్థములో మోటుగనుండు నలుసులుండును. ఈ నలుసులు ఇయోసిౝ మొదలగు ఆమ్లవర్ణముల నాకర్షించును. (Oxyphill). ఇవి నూటికి 2 మొదలు 4 వరకు నుండును.
3. జీవస్థాన మేకముగనున్న పెద్ద తెల్లకణములు. (Large Mononuclear Leucocyte) ఇందు పెద్ద జీవస్థానమును, దానిచుట్టుకొంచెము మూలపదార్థము నుండును. ఇందు నలుసు లంతగా కానరావు. ఇవి నూటికి 2 మొదలు 4 వరకుండును.
4. చిన్న తెల్ల కణములు (LymPhocyte) ఇందు గుండ్రని చిన్న జీవస్థానమును, కొద్దిపాటి మూలపదార్థము నుండును. ఇందును నలుసులు కానరావు. ఇవి నూటికి 20 మొదలు 25 వరకుండును.
5. ఇవిగాక జీవస్థాన మేకముగ గల పెద్ద తెల్లకణములకును, బహురూప జీవస్థానముగల తెల్లకణములకును మధ్యమున కొన్ని తెల్ల కణములు కలవు. వీనికి మధ్యమ తెల్లకణములు (Transitional Leucocytes) అని పేరు. ఇందు జీవస్థానము బొబ్బర (అలచంద) గింజవలె మధ్య పల్లమును రెండు అంచుల లావుగనుండును. ఇవి క్రమముగ బహురూప జీవస్థానముగల తెల్లకణములుగా మారును.