96
వారును నిట్లే యనేకదివ్యస్థలముల దేవతలపై సంకీర్తనముల రచించిరి. తాళ్ళపాకవా రాయాదేవతలకుఁ దిరుపతి వేంకటేశ్వరునితో నభేదము గల్పించి వేంకటేశ్వరనామముద్ర యుంచినట్లు క్షేత్రయయు నాయాక్షేత్రములదేవతలకు మువ్వగోపాలునితో నభేదము గల్పించి మువ్వగోపాలముద్రను సంకీర్తనములకుఁ గూర్చెను. త్యాగరాయలవారాయాక్షేత్రములదేవతలఁ బేర్కొనుచుఁ గడపటి చరణమునఁ దనపేరే ముద్రగా వెలయించిరి.
రాజస్తుతిపరాఙ్ముఖత్వము దేవతార్చనవిగ్రహములను గోల్పోవుట మొదలగు విషయములు కొన్ని యన్నమాచార్యునకును, త్యాగరాజునకును సమానముగాఁ దటస్థించినవి. అన్నమాచార్యుని శృంగార సంకీర్తన రచనాంశము క్షేత్రయ్యగాను ఆధ్యాత్మ సంకీర్తన రచనాంశము త్యాగయ్యగాను నవతారముదాల్చె ననఁజెల్లును. అన్నమాచార్యునట్లు సంకెళ్లువేసి చెరలోనుంచుట స్వామికృపవలన నాక్లేశము తొలఁగిపోవుట రామదాసుగారికిని గలిగెను.
అన్నమాచార్యుని పలుకుబళ్ళు
అన్నమాచార్యుని సంకీర్తనములభాష పశ్చిమాంధ్ర దేశమున వాడుకగన్నది. ఆతనిపలుకుబళ్ళు చాలా కృష్ణరాయలయుఁ దదాస్థానకవులయు రచనలలోని కెక్కినవి. రాయలతో, దఱచుగాఁ దిరుపతికి వచ్చి స్వామి సన్నిధిని తాళ్ళపాకవారి సంకీర్తనముల వినుచుండుటచే నాయాకవులకు వీరి పలుకుబళ్ళు సుపరిచితములయి యుండవచ్చును. మచ్చుకుఁ గొన్ని :-
చిగురుఁగొమ్మైనఁ జేవ, మీసాలపై తేనియల్, నందు సుడిమాయలు, తంగేటిజున్ను, నూతులుత్రవ్వితే బేతాళాలు బయల్పడును, కోలగగ్గెర, పొరి విడంగాయములు, గోవాళ్ళు, చిందువందు, తలవూవాడక.
తాళ్ళపాకవారి సంకీర్తనముల ఛాయలు వేమన పద్యములలోని కెక్కినవి.