పుట:Annamacharya Charitra Peetika.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

 కూడఁ దచ్చరిత్రము కొంత గుర్తింపనగును. నలుదెఱఁగుల సాధనములను గ్రుచ్చి యెత్తి హృద్యమయిన తచ్చరిత్రము నుద్ధరింప యత్నింతును.

అన్నమయు వంశము

అన్నమాచార్యుఁడు నందవరవైదిక బ్రాహ్మణవంశమున జన్మించినాఁడు. ఈ వంశమువారు ఋగ్వేదులు. ఆశ్వలాయనసూత్రులు. భరద్వాజగోత్రులు. పొత్తపినాఁటిలోని తాళ్లపాకగ్రామమున[1] నుండినవారు.

లభించిన తాళ్ళపాకవారి యితరగ్రంథములలో నెందుఁగాని యన్నమయ పితృపితామహాదుల ప్రశంసలేదు. ఇందే అది కలదు. (చూ4 నుండి 8 పుటలు) అన్నమాచార్యునితాత విద్యాభ్యాసమునకు ఊటుకూరను బంధుగ్రామమున కరిగిన ట్లున్నది.[2]

అవతారము

అన్నమాచార్యునితల్లి లక్కమాంబ[3] మాడుపూరిమాధవస్వామి భక్తురాలట. అది యామె పుట్టినింటివారియూరు గాఁబోలును. అన్నమయ శక. 1346 క్రీ. 1424 క్రోధి వైశాఖమాసమున విశాఖా నక్షత్రమున జన్మించినాఁడు. వన్నిద్దరాళ్వార్లలో ముఖ్యులగు నమ్మాళ్వార్లు (శఠకోపయతి) కూడ వైశాఖవిశాఖనే జన్మించిరి. జన్మోత్సవము పుట్టిన నక్షత్రమునుబట్టియును, నిర్యాణోత్సవము చనిపోయిన తిథిని బట్టియును జరుపుట నంప్రదాయము. వైశాఖమాసమున విశాఖా నక్షత్రము ప్రాయికముగా పూర్ణిమాతిథికి వచ్చును. కనుక వైశాఖ పూర్ణిమ జన్మతిథిగాఁ గూడ నిర్ణయింపవచ్చును. శక.1424, క్రీ.శ.1503 దుందుభి ఫాల్గుణ బహుళ ద్వాదశినాఁ డాతఁడు దివ్యధామ మందినాఁడు. అతని జీవిత పరిమాణము 79 ఏండ్లు. ఇటు చూడఁగా నేఁటి కాతఁడు జన్మించి 524 ఏండ్లయినది. దివ్యత్వమంది 445 ఏండ్లయినది.

  1. తాళ్లపాక నేఁటి కడపజిల్లా రాజంపేట తాలూకాలోనిది.
  2. చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయనిమీఁద సంకీర్తనములు రచించెను.
  3. మాడుపూరు, కడపజిల్లా సిద్ధపటము తాలుకొలో నున్నది.