Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అన్నమాచార్యచరిత్రపీఠిక

అవతరణిక

అన్నమాచార్యచరిత్రము కథాపురుషుని మనుమఁడే రచించినది కాఁబట్టి విలువగల ప్రామాణిక చరిత్ర గ్రంథము. తెనుఁగున ప్రాచీనకాలపుఁజరిత్రగ్రంథములు కవీశ్వరులవి, ప్రాచీనులే ఆయా కవీశ్వరుల దగ్గఱి కాలమువారే కవితతో రచించినవి, చాలఁ దక్కువ.

బసవపురాణము, పాండితారాధ్యచరిత్రము, తిక్కనచరిత్రము (దశకు- ౧ఆ.) కృష్ణరాయయచరిత్రము, రఘునాథనాయకాభ్యుదయము, నృసింహగురుచరిత్రము, ఇట్టివి కొన్నిమాత్రమే వ్రేళ్ళలెక్క కెక్కి యున్నవి. అం దీయన్నమాచార్యచరిత్రము మతపాండిత్యకవితా ప్రఖ్యాతి గన్న మహనీయని చరిత్రమై చాలఁగా జరిగిన విషయములనే సవదరించు నదిగా నిరూపణకెక్కి నా కెక్కువమక్కువ గొల్పినది.

దీని రచయిత చినతిరువెంగళనాథుఁడని నిండు పేరుగల చిన్నన్న ఈతని విషయము 'అన్నమాచార్యసంతతి' అనుపట్టున వివరింతును. [1]ఈ యన్నమాచార్య చరిత్రమునుబట్టియే కాక, అన్నమాచార్య రచితము లయిన సంకీర్తనములఁ బట్టి, తత్ర్పసక్తము లయిన శాసనములఁబట్టి, అన్నమాచార్యుల పుత్రపౌత్రాదులు రచించిన సంకీర్తన కావ్యాదులనుబట్టి,

  1. ఈ యన్నమచార్యచరిత్ర కాగితపు వ్రాఁతపుస్తకమును కడపజిల్లా రాయచోటి తాలూకా మడితాడుగ్రామవాసి శ్రీ తాళ్ళపాక సూర్యనారాయణయ్యగారు తిరుపతి వెంకటేశ్వర ప్రాచ్య గ్రంథాలయమున కొసగిరి. ప్రాఁత తాటాకు ప్రతి ననుసరించి వారు దానిని 1940 సం||లో వ్రాసిరట. దానితో రేవణూరి వెంకటాచార్యుని శ్రీపాద రేణుమాహాత్మ్యమును, తాళ్ళపాక చిన్నన్న తామ్రాశాసనమును గూడ వా రీగ్రంథాలయమున కొసఁగిరి. తామ్రాశాసనమునుస శ్రీమా. రామకృష్ణకవిగారు జర్నల్ వాల్యుం 1 పార్టు 1లో ప్రకటించిరి.

    ఈ యన్నమాచార్య చరిత్ర వ్రాత్రఁప్రతిలో గ్రంథము ముగిసిన తర్వాత 7 పుటలో ‘తాళ్ళపాక తిరువెంగళనాథుని జీవితచరిత్రము కార్వేటినగర సంస్థానములో ఉన్నది. చూడవలెను." అని కలదు. అట్లది కార్వేటినగరమునఁ గలదేమో.