Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57




పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి।
కట్టినది మొలఁ జిన్నకౌపీనము।
పట్టినది శ్రీహరిపాదపద్మమూలము।
యెట్టయినా మాకు మేలె యింకనేల చింత ॥కోటి॥ 1

చిక్కి నాలో నైనది శ్రీవైష్ణవధర్మము।
తొక్కినది భవముల తుదిపదము।
యెక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగు।
యెక్కువ కెక్కువేకాక యింక నేల చింత ॥కోటి॥ 2

చిత్తములో నిండినది శ్రీపతిరూపము।
హత్తినది వైరాగ్య మాత్మధనము॥
యెత్తలం జూచిన మాకు నిదివో శ్రీ వేంకటేశుం।
డెత్తి మముఁ గావఁగాను యింకనేల చింత ॥కోటి॥ 3

అన్న అధ్యా. 307 ఱేకు.


కొండకుఁ బయనము


అన్నమాచార్యుఁడు పెనుగొండ (రాయలయాస్థాని) నో తాళ్ళపాకనో వీడి స్వామిని దర్శింప రాఁగోరి చెప్పినసంకీర్తనము: -


లలిత


     రామ కృష్ణ నీవు నందె రాజ్యమేలుచుండుదువు ।
     యేమి సేసే విక్కడ నీయిరవుకే పదవే ॥పల్లవి॥

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు ।
అంకె సుగ్రీవుఁ గిష్కంధ కంపినయట్టు ।
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు ।
వెంకటాద్రి పొంతనుండ వేగ మమ్ము నంపవే ॥రామ॥ 1

ఘనకీరీటము దేను గరుడని నంపినట్టు ।
అనుఁగుఁ గవులనిండ్ల కంపినట్టు ।
నొనర గోపికలొద్ద కుద్ధవుని నంపినట్టు ।
ననుపు శేషాద్రి నుండ నన్ను నంపవే ॥రామ॥ 2