44
శ్రీమద్వీరనృసింహరాయనృపతే ర్భూదేవహత్యావ్యధాం దూరీకృత్య తదర్పితోజ్ఞ్వలమహాసింహాసనే సంస్థితః శ్రీమత్పూర్వ కవాటనామకవురే సర్వేష్టసిద్ధిప్రదః శ్రీ శ్రీపాదయతీంద్ర శేఖరమణి ర్భూయా త్సవః శ్రేయసే.
క్రీ. 1440 నాఁటికి బదునాజేండ్లవాఁడయిన యన్నమాచార్యుఁ డీ రాజోప్లవము లెల్ల నెఱుఁగున్నాడు. నరసింహరాయలప్రార్ధనమునఁ గాబోలును దఱచుగా విద్యానగరమున కరగుచు నక్కడ వెలసియున్న వేల్పులపై పెక్కుసంకీర్తనముల రచించినాఁడు. ఆయాకాలములలో నాతని కక్కడిరాజుల దౌర్జన్యములు ప్రత్యక్షము లగుచుండెడివి. రాజ్యలబ్ధికై నాఁటి రాజులు చేసిన పితృభాతృ పుత్రహత్యాదుల నాతఁడు సంకీర్తనములలో వివరించి విలపించినాఁడు.
శ్రీరాగం
వెఱతు వెఱతు నిందు వేడుకపడ నిట్టి కుఱుచబుద్ధుల నెటు గూడుదునయ్యా || పల్లవి ||
దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు ! ద్రోహిగాక నేఁడు దొరయటా ! ఆహికముగ నిట్టి అధమవృత్తికి నే ! సాహసమున నెట్టు చాలుదునయ్యా || కుఱు || 1
తోడఁబుట్టినవానిఁ దొడరి చంపెడువాఁడు ! చూడ దుష్టుఁడుగాక సుకృతియట ! పాడైనయిటువంటి పాపబుదులు సేసీ ! నీడ నిలువ నెట్టు నేరుతునయ్యా || కుఱు || 2
1. దీనిని దొలుత కర్ణాటచరిత్రకారులు గుర్తించిరి.