38
మలహరి
సర్వోపాయముల జగతి నా కితండె
వుర్విధరుఁడు పురుషోత్తముం డితండె ॥పల్లవి॥
సకల గంగాదితీర్థస్నానఫలము లివి
స్వామిపుష్కరిణిజలమె నాకు !
సకలపుణ్య క్షేత్రవాసయాత్ర లివి
సరివేంకటాచలవిహార మిదియె !
సకలవేదాధ్యయన శాస్త్రపాఠంబు లివి
శౌరిసంకీర్తనం బిదియె నాకు !
సకలకర్మానుష్ఠానము లితని కిచ్చటఁ
జాతుపడికైంకర్య మిదియె ॥సర్వో॥ 1
ఉపవాసతపము లివి యితనిప్రసాదంబు
లొగి భుజించుటె నాకు దినదినంబు !
జపరహస్యోపదేశంబు లితనిపాద
జలములు శరణనేటిసేవయొకటె !
ఉపమింపఁ బుణ్యపురుషులదర్శనము నాకు
నొగి నిచటిబహువృక్షదర్శనంబు !
యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి
యెన్నఁ గలబహుపక్షి కలకలంబు ॥సర్వో॥ 2
తలఁపుగలయోగంబులందు శ్రీవైష్ణవులఁ
దగులుసంవాససహయోగంబు !
వెలయు నిండుమహెూత్సవంబు లిన్నియు నితని
విభవంబు లెసఁగుతిరునాళు నాకు !
చెలఁగి యిటుదేవతాప్రార్థనింతయు నాకు
శ్రీవెంకటేశ్వరుని శరణాగతి
అలరునాసంపదలు యితనిపట్టపురాణి
అలమేలుమంగకడగంటిచూపు ॥సర్వో॥ 3
అన్న అధ్యా, 133 ఱేకు.