26
భూపాళం
పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి ॥పల్లవి॥
హరినామములే పాడి అతనిపట్టపురాణి!
ఇరవై మించినయట్టియిందిరఁ బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ॥పావ॥ 1
ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి!
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి!
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి!
ఆదరానఁ గంబుకంఠ మంకెతోఁ బాడి ॥పావ॥ 2
శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి!
శ్రీవత్సముతోడురముఁ జెలఁగి పాడి!
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ॥పావ॥ 3
అన్న అధ్యా.173 ఱేకు.
స్వామియభయహస్తము
సామంతం
ఇందఱికి నభయంబు లిచ్చుచేయి
కందువ లగుమంచి బంగారుచేయి ॥ఇంద॥
వెలలేనివేదములు వెదికి తెచ్చినచేయి!
చిలుకుగుబ్బలిక్రిందఁ జేర్చుచేయి!
కలికియగు భూకాంతఁ గౌఁగిలించినచేయి!
వలమైనకొనగోళ్ళ వాఁడిచేయి ॥ఇంద॥ 1
తనివోక బలిచేత దాన మడిగినచేయి!
ఒనరంగ భూదాన మొసఁగుచేయి!