Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107


అంటి కానరాని తనయాత్మ తప్పకచూచు।
కొంటెఁ దనయాత్మయును గొబ్బునఁ గాన్పించును ॥పట్టి॥ 1

మించికఠినపురాతిమీఁదఁ గడువ వెట్టితే।
అంచెలఁ దానే కుదురైనయట్టు।
పొంచి హరినామ మేప్రొద్దు నాలికతుదను।
ఎంచి తలఁచఁదలఁచ నిరవౌ సుజ్ఞానము ॥పట్టి॥ 2

ఒక్కొక్కయడుగడుగె ఒగి ముందు వెట్టితే।
ఎక్కువౌ కొండైన నెక్కుఁగొనకు।
ఇక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును।
పక్కనం గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును ॥పట్టి॥ 3


లలిత


ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా।
వోడక నీదండ చేరి వున్నారమయ్యా ॥పల్లవి॥

ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు।
యేసుఖదుఃఖములుఁ దా మెఱుఁగ నట్టు।
వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక।
యీసులఁ బుణ్యపాపము లెఱఁగమయ్యా ॥ఆడుతా॥ 1

ఏలినవారు వెట్టఁగా నేపునఁ దొత్తులు బంట్లుఁ।
అలకించు పురులఁ బో యడుగనట్టు।
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా!
యేలని యేమియుఁ గోర వెఱుఁగమయ్యా ॥ఆడుతా॥ 2

చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁ గలవాఁడు।
యేతులఁ గలిమిలేము లెఱుఁగనట్టు।
ఆతుమలో శ్రీవెంకటాధిప నీ వుండఁగాను।
యీతల నేవెలుతులు నెఱుఁగమయ్యా ॥ఆడుతా॥ 3

అన్న. అధ్యా. 268 ఱేకు.