పుట:Andrulasangikach025988mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనముకూడా చరిత్ర కెక్క దగినవారమే!! అలాఉద్దీన్‌ఖీల్జీ, ఔరంగజేబు ఆసఫజా చరిత్రలకంటే మన చరిత్రలు మాత్రము తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము కాన బహుశ మనమే మెరుగేమో!

సాంఘిక చరిత్ర మానవ చరిత్ర - ప్రజల చరిత్ర, అది మన సొంతకథ !! ఆది జనుల జీవనమును ప్రతి శతాబ్దమం దెట్లుండెవో తెలుపునట్టిది. అది మన తాతముత్తాతల చరిత్ర: వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాటులు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును.

ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను 200 ఏండ్లనాడే వ్రాసిరి. నాటినుండి నేటివర కెందరో ఎన్నియో పుస్తకా లీ విషయమై వ్రాసిరి. ఆ పుస్తకాలలో 500 ఏండ్లనుండి తమ పూర్వు లెట్టివారో, వారి పరిశ్రమ లెట్టివో తెలుపు పటాలు నిండుగా ముద్రించినారు. తమ దేశమును గురించియే కాక, ప్రపంచమం దితరుల చరిత్రలను గూడ వారు వ్రాసి ప్రకటించినారు. మన చెంచులను గురించి సహారా ప్రాంతపు నగ్నలను గురించి, ఆఫ్రికా కాఫిర్లను గురించి, అసాం నాగులను గురించి శాంతి మహాసాగర మందలి కొన్ని దీవులందలి మనుష్య భక్షకుల (రాక్షసుల) ను గురించి, ఉత్తరధ్రువ ప్రాంతాలలో ఆరు నెలలు చీకటి ఆరు నెలలు ఎండలో జీవించు ఎస్కిమోలను గురించి యిట్టిసహస్రాధిక విషయాలను గురించి తెలుసుకొనవలెనంటే మనకు ఇంగ్లీషు (శారద నీరదేందు) శారదయే ఉపాస్య యగును. అందలి సారస్వతమందు సర్వజ్ఞత కలదు. ఇంగ్లీషులో మానవజాతి కథ (Story Of All nations) అనేక బృహత్సంపుటములలో సచిత్రముగా ముద్రింపబడి బహుకాల మయ్యెను. దానినైనను మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా?

మన బళ్ళలో విద్యార్థులకు చదివించే చరిత్రలలో చాలా కల్మషము కలదు. పాలలో విషముష్టి పడినది : ఇంగ్లీషువారు తమ ఘనతను భారతీయుల కొంచెపుదనమును నిరూపించునట్టుగా చరిత్రలు వ్రాసిరి. ముస్లిములలో పూర్వము ఫిరష్తా అబద్ధాలతో తనచరిత్రను నింపెను. బాబరు హిందూద్వేషముతో వ్రాసెను. నేడును ఉస్మానియా విద్యాపీఠమందును చిన్న తరగతులనుండి బి.ఏ. వరకు