పుట:Andrulasangikach025988mbp.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మీకు తెలియరాగలదు. అని వర్ణించునప్పుడు కృత, ద్వాపరపదాలను ప్రయోగించుటచే ఈయాటనే పాండవు లాడిరనుట స్పష్టము. ఇప్పుడీయాటను తెనుగువారు నక్కమష్ట (నక్కముష్టి, లక్కిముష్టి) అను పేరుతో ఆడుతున్నారు. ఈ కలిద్వాపరాది భేలనవిధాన మొక్క భారతదేశమందేకాక ఏసియా, యూరోపు ఖండములలోని బహుదేశాలలో అతిప్రాచీనకాలమం దాడినట్లు మనకు నిదర్శనములు దొరకినవి. పూర్వము గ్రీసు, ఈజిప్టు దేశాలలో ఈయాట విరివిగా నుండెను. ప్రాచీనపు ఈజిప్టు జనులు శవాలతోపాటు పాచికలనుగూడ పూడ్చుతుండిరి (పరలోకములో ఆ జీవు లాడుకొందురని అట్లు చేసెడివారు). క్రీ.పూ. 1200 ప్రాంతమందు ట్రాయియుద్ధము 10 ఏండ్లు సాగినప్పుడు ముట్టడివేసిన గ్రీకుసైనికులు ప్రొద్దుపోకకై యీ పాచికల నాడిరి.

తెనుగు వాఙ్మయములో నాచనసోమన తర్వత యిద్దరు ముగ్గురు కవులు సోమన వర్ణించిన విధముగనే వర్ణించిన దీసందర్బమందే సూచించుట బాగుండును. పింగళి సూరన కళాపూర్ణోదయమందు (3-131) "తచ్చొక, చౌవంచ, యిత్తిగ, బారా, దుగ"యని పాచికలాడినట్లు వర్ణించెను.

సలకుసాల రుద్రకవి తన నిరంకుశోపాఖ్యానములో (2-22) "బారా, పది, దచ్చి, యిత్తుగ, దుగా"యని పాచికలాడినది వర్ణించెను. దాని మరి కొన్ని వివరా లిట్లు తెలిపెను. (3-20)

      "ధృతిపెంపొందగ సారెసారెపయి సారెంజూచుచున్ సారెవో
       వుతరింబోవుచు జోడుగట్టు తరి రివ్వుల్ మీర జోడించుచున్
       జత, బారా, పది, దచ్చి యిత్తుగ, దుగా, చౌపంచ, తీవంచ
       బొంకితినానర్తకి యంచు నాడెను భయాంగీకార మేపారగన్.

నాచన సోముని కాలమునుండి మనకాలమువర కీపాచికల ఆట ఈ విధముగా వచ్చియున్నది.[1] విష్ణుమాయానాటకము (మద్రాసు యూనివర్సిటీ

  1. పాచికల యాట ఇప్పటికిని వైదిక బ్రాహ్మణులలో కలదని విని కర్నూలులో నొకనాడు నాలుగుగంటలవరకు కొన్ని యిండ్లలో విచారించితిని. అందరు నాయాట నాడుదుమనిరి. కాని చూపరైరి. తుదకు అలంపూరులో బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణశర్మచే ఆడించి కనుగొంటిని. నేను శ్రమచేసి వారియాట చూచినందుకు ప్రతిఫలము వారి పాచికలను తెచ్చుకొనుటయే!