పుట:Andrulasangikach025988mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      క. అత్తీవంచ తిగదుగయు
         సత్తాదచ్చౌక వంచి చౌవంచీరై
         దిత్తిగ యిద్దుగ బద్రలు
         చిత్తంబున దలచినట్లు బేతికి దెచ్చున్.

(ఉత్తరహరివంశము. అ. 3 వ. 120-121, ఈ సందర్బములో 109 నుండి 129 వరకు ఈ పాచికల ఆటను వర్ణించినది చదువుట అవసరము. ఈ పద్యాలలో పెక్కుపదాలు అర్థముకాని వై పోయినవి.)

ఈ యాట మన తెనుగు వారిలో విశిష్టతతో నిలిచిన దనవచ్చును. నేటికిని ఈ యాటను రెండు పాచికలతో వైదిక బ్రాహ్మణ స్త్రీ పురుషులు పలువురాడుచున్నారు. తక్కిన వర్ణములవారు పాచికలకు మారుగా 6 కాని 7 కాని గవ్వలను లొడివేయుచు ఆడుదురు. ఆయాటను పచ్చీస్ అందురు. అనగా మన "నెత్తపు" ఆటను ముసల్మానులు స్వీకరించిరనియు, మరల వారి నుండి వారి మాటలతో మనవారు దానిని స్వీకరించి రనియు గ్రహింపవలెను. దస్, బారా, పచ్చీస్, తీస్ అను పదాలను తెనుగువారును వాడుచున్నారు. మొద లీ పద్యాలలోని వర్ణనమును తెలుసుకొందము. ఆట ప్రారంభించు వారు "జోగిణి" దేవతకు మ్రొక్కుకొందురు. ఒక కట్టెపలకపై కోపుబలముతో ఇండ్లను గీయుదురు. ఆటగాండ్లు "స్వరము" (సూర్యచంద్రనాడులను నాసికాశ్వాసముల శాస్త్రమును) చూచుకొని ప్రారంభమందే ఎంతెంత పందెము అని నిర్ణయించుకొందురు. ఈ విధముగా రుక్మిణీకృష్ణులు నెత్తము నారంభించిరట.

ఈ యాటకు గల సంకేతములు గమనింపదగినవి. దుగ, తుగ, సత్తా, బద్రలు మున్నగు పేరులు పెట్టుకొనిరి. బద్ర అను పదమువద్ద శబ్దరత్నాకరమం దీ వివరణ నిచ్చినారు. బద్ర అన పన్నెండు. 'సొగటాలాటయందు పాచికలు రెండు. ఆ పాచిక లొక్కక్కటికి నాలుగు ప్రక్కలు, ఒక్కొక్క ప్రక్కకు అరు నారును, నాల్గు నాల్గును, మూడు మూడును, ఒకటొకటి యనగా జతలు ఎనిమిదింటికి బొట్లు ఇరువది యెనిమిదియై యుండును. ఆ పాచికలు రెంటిని తూనించి వేయునప్పుడు వాని పొర్లిక భేదముచేత 12, 10, 9, 8, 7, 6, 5, 4, 2 గా పందెములు తొమ్మిది పడును. కాన ఆ పందెములు తొమ్మిదియు 'అత్తీవంచిత్తిగ' అను పద్యములో చెప్పబడియున్నవి.