పుట:Andrulasangikach025988mbp.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమ ముద్రణ పీఠిక

పూర్వకాలమందు హిందువులాధ్యాత్మ చింతాసాగరమున తల మున్కలు వేయుచు ఇహలోక విషయాలపై స్పృహ తప్పినవారై చరిత్రలు వ్రాసిపెట్టు నాచారము లేనివారై యుండిరని యూరోపుఖండ పండితులు వ్రాయుట పరిపాటియైపోయినది. తర్వాత వారి పరిశోధన మూలముననే అసంఖ్యాకములగు చరిత్రాత్మక గ్రంథాలు వెలువడెను. అనేక పుస్తకాల జాడ లీనాటివరకు పరిశోధకులకు కానరాలేదు. ముసల్మానువిజేత లనేక పుస్తకాలయములను, దేవాలయములను, విద్యాపీఠములను ధ్వంసము చేయునప్పు డందలి గ్రంథాలను కాల్చిరి. ఈ విధముగా మన చరిత్రకు అపారనష్టము కలిగెను.

పాశ్చాత్యులు నేటివరకు వ్రాసిన చరిత్రలు, రాజుల చరిత్రలు, ఎనిమిదవ హెన్రీకి ఏడ్గురు భార్యలనియు, ముప్పైయేండ్ల యుద్ధము ఆముక తిథులందు జరిగెననియు 1748, హిందూస్థాన చరిత్రలో ప్రసిద్ధి యనియు, క్యాతరీన్ రష్యా చక్రవర్తిని కింద రుపభర్తలుండిరనియు చరిత్రలో మరచిపోకుండా వ్రాయుదురు. వాటివల్ల మన కేమిలాభం? రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు, సంఘానికి నష్టము కలిగించినట్టివే. ఈ విషయము నిటీవల గుర్తించి పాశ్చాత్యులు సాంఘిక చరిత్ర కెక్కుడు ప్రాధాన్య మిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి.

రాజుల చరిత్రలు మన కంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో. మన అవ్వలు ఎట్టిసొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వు లే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి