పుట:Andrulasangikach025988mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనాడు జనులెక్కి గిర్రున తిరిగిన రంకురాట్నం నేటికిని ఆదరణీయమై యున్నది.

        "చటిల సంస్కృతి జీవఘట చక్రవర్మ
         పటు పరివర్తన భ్రమణంబు గూర్చి
         కీలువొందించి యాక్రియ రాటనముల
         వాలి యాడించు నా వడ్రంగి యతడు"[1]

శైవ సాంప్రదాయములో నందికోల ఆట యుండెను. అది నేడును కార్తీక మాసమందు జరుగును.

        "కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు
         గేళిక జోకయు లీల నటింప"[2]

అనుటచే కోలాటము, గొండ్లి (గర్భనృత్యము), పేరిణి కుంభముపై నృత్యము మున్నగునవి యుండెనని తెలియును. ఇవే విషయములను నాచన సోమనయు తెలిపినాడు. పేరణము, కోలాటము, గొండ్లి, ప్రేంబణము అను వానిని అతడు పేర్కొనినాడు.[3] గోండు అను అటవికుల కుండలాకార నృత్యమును చాళుక్య సోమేశ్వరుడు (అభిలషితార్థ చింతామణి కర్త) 1150 ప్రాంతమందు తన రాజ్యమందు ప్రచారము చేయగా అది జన సామాన్యమందు విరివిగా వ్యాపించెను. రెండు ఆటలు ప్రత్యేకముగా తెనుగు ఆటలై పోయెను. ఒకటి ఉప్పనపట్టెలాట, రెండవది గిల్లదండ ఆట. "ఉప్పన పట్టె లాడునెడ మప్పులు డెత్తురుగాక యాదవుల్"[4] నేటికిని ఈ యాట నాడుదురు. ఉప్పు సముద్ర తీరమునుండి లోభాగాల కందువరకు దొంగలనుండి, పరరాజ్యముల సుంకాలనుండి, దౌర్జన్యపరుల నుండి తప్పించుకొని వచ్చుటలో నుండు కష్టాలను ఆటగా చేసుకొని యాడిరేమో!

  1. పాల్కురికి బసవపురాణము. పు 102.
  2. పాల్కురికి బసవపురాణము. పుట 22.
  3. నాచన సోముని ఉత్తర హరివంశము పు 172.
  4. నాచన సోముని ఉ. హరివంశము పు 158.