పుట:Andrulasangikach025988mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       జోగయ్య నాకు కొన్ని జొన్నగింజ లిచ్చె
       ఏటియొడ్డున సేద్యంబు చేస్తే
       ఈడ్చికొడితే ఇరవై పుట్లు
       అర్చికొడితే అరవై పుట్లు
       అన్నీ కొంచబోయె అప్పయ్యదొరా
       ఇసుకో ఉసుకో ఇద్దుమె వుంచే
       తాలో తౌడో తవ్వడె వుంచే
       మన్నో మైలో మానెడె వుంచే
       ఉప్పులేని గంజి తాగీతిమయ్యా
       చొప్పకట్టలోలె సోలీతిమయ్యా
       కుక్కిమంచములో కూలీతిమయ్యా
       జాజీరి జాజీరి జాజీరీ పాపా

ఎక్కడనుండో సాహుకార్లు వచ్చి అప్పు లిచ్చి రైతుల కొంపలు తీయుట, నాగులకు, అప్పులకు, వడ్డీలకు ఇచ్చి పంట పండినవెంటనే కల్లములోనే ధాన్యాన్ని దొరలు లాగుకొనిపోవుట, బీదరైతులు వారి కూలీలు, ఆకలితో కూలబడుట, ఇట్టి యవస్థలన్నియు తెలంగాణమందు నిత్యజీవనము లోనివి. వాటినే జాజిరి పల్లవిలో సరరహితులగు రైతులు పాడుకొని తృప్తిపడినారు.

"కలమాట లాడుచు, మొలపుండ్ల మల్లని, బాడుచు"[1]

అని కేతన వర్ణించుటనుబట్టిచూడగా ఆనా డది జనసామాన్యములో పాడుకొను పాట యేమో?

బొమ్మలాట మన యాదివాఙ్మయమందు కానవచ్చుటచేత అది ప్రాచీన మైనదేకాని ఆధునిక కాలములో ఆ యాట మరాటీవారి వశమైనది. "ప్రతిమల వాడగ బట్టినయట్లు" అని పల్నాటి వీరచరిత్రలో వర్ణించినారు.

         "యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు
          బొమ్మలగతి రథపూగములును"[2]

  1. దశకుమార చరిత్ర.
  2. ఉ. హరివంశము, పు 281.