పుట:Andrulasangikach025988mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       నెరపట్టు, వెలిపట్టు, నేత్రంబుపట్టు,
       మరి తవరాజంబు, మాందోళరవియు,"[1]

ఇంకా 20 విధాల బట్టలపేర్లను తెలిపినాడు. దేవుని యెదుట త్రిపురాంతకములో పంచలోహస్తంభమును పాతియుండిరి. అది "ఇనుము, పిత్తళి, కంచు, హేమ, తామ్రముల, పంచలోహముల"తో సిద్ధము చేయబడినట్టిది. బ్రహ్మనాయడు దాని నర్చించెను. [2] లక్కబొమ్మలను చేయుట విరివియై యుండెను. 'పూచిన కింశుకం బనగ పుత్తడిలత్తుక బొమ్మవలె' అని నాచన సోముడు వర్ణించెను. [3] 'చేతి జంత్రంపు బొమ్మలనిన బొమ్మలాటయై యుండును.[4] ఓరుగంటి మైలసంతలో 'సుసరభేత్‌' అను 'సరభేదనము' చేయు మందును అమ్మిరి.[5] దానిని 'పెద్ద దంతంబు పెట్టె'లో పెట్టి యమ్మిరి. దంతపుపనులు చాలా హెచ్చుగా నుండుటచే; మాలమాదిగలుకూడ వాటిని వాడుకొనుచుండిరి. సైన్యమునకు కావలసిన వివిధాయుధములను, యుద్ధభేరీలను ఆటపాటల కవసరమగు వాద్య విశేషములు, స్త్రీల అలంకరణమునకు కావలసిన యాభరణములు, రంగులు మున్నగునవి చేయువారు, వాటిచే జీవించువారు చాలమంది యుండిరి. ధనికులు పల్లకీలలో పోవుచుండిరి. వాటిని చేయు వడ్రంగులు నానావిధములగు సుందర శిల్పములతో కట్టెలపై పనితనము చూపించెడివారు.

మట్టెవాడ అను పేరు అచ్చట మట్టెలుచేసి యమ్ముటచేత ఏర్పడిన దందురు. ఓరుగంటిలో మంచి మంచి యున్ని కంబళములు సిద్ధమగు చుండెను.[6] ఓరుగంటిని లాగుకొనిన తురకలు రత్నకంబళముల వృత్తినిగూడ లాగుకొనిరి. తర్వాత వారు "తివాసీల"ను చేయు కళను వృద్ధి చేసుకొనిరి. నేటికిని వాటిని ఓరుగల్లు కోటలోని తురకలే సిద్ధముచేస్తున్నారు.

  1. బసవపురాణము పు 56.
  2. పల్నాటి వీరచరిత్ర, పు 6.
  3. ఉత్తర హరివంశము, పు 180
  4. నాచన సోముని ఉత్తర హరివంశము, ఆ 5, ప 212.
  5. క్రీడాభిరామము.
  6. "హాహా నృపాల సింహాసనాధిష్ఠాన రత్నకంబళ కాభిరామరోమ" క్రీడాభి.