పుట:Andrulasangikach025988mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      "కోలదాపున ద్రిక్కటి గూడియున్న
       గచ్చుచేసిన చిత్రంపుగద్దె పలక
       వ్రాసినా రది చూడరా వైశ్యరాజ !
       శీల బ్రహ్మాది వీరనాసిర చరిత"[1]

"కర్దమద్రవము" మషీరసము, హరిదళము, ధాతురాగము, మున్నగు వర్ణముల (రంగుల)ను తూలిక (కుంచె)తో చిత్తరువులు వ్రాయుట కుపయోగించెడివారు (కాశీఖండము 1-1-23).

చేతి పనులు

తెనుగుసీమ ప్రాచీనమునుండి సన్నని నూలుబట్టలకు ప్రసిద్ధి. మసూల (మచిలీ బందరు)లో లభ్యమగు సన్నని బట్టనుండి ఇంగ్లీషులో మస్లిన్ పద మేర్పడెను. కాకతీయులకాలములో ఎన్నివిధములగు వస్త్రాలు సిద్ధమవుతుండెనో పాల్కురికి సోమనాథుని వివరణను చూచిన ఆశ్చర్యము కలుగును.

       "వెంజావళియు, జయరంజియు, మంచు
        పుంజంబు, మణిపట్టు, భూతిలకంబు,
        శ్రీవన్నియయు, మహాచీని, చీనియును
        భావజతిలకంబు, పచ్చని పట్టు,
        రాయశేఖరమును, రాయవల్లభము,
        వాయుమేఘము, గజవాళంబు, గండ
        పడము, గాపులు, సరిపట్టును, హంస
        పడియు, వీణావళి, సల్లడదట్టి,
        వారణాసియు, జీకువాయు, కెందొగరు,
        గౌరిగనయమును, క్షీరోదకంబు,
        పట్టును, రత్నంబుపట్టును, సంకు
        పట్టును, మరకతపట్టు, పొంబట్టు,

  1. క్రీడాభిరామము. (పల్నాటి వీరచరిత్రలో "శ్రీరామకథలును, శ్రీకృష్ణ కథలును పన్నుగా వ్రాసిన పటములను దెచ్చి" అని వ్రాయుటచే చిత్రలేఖన చరిత్ర మరింత ప్రాచీనము దగుచున్నది. [చూ. పల్నాటి, పు. 16]