పుట:Andrulasangikach025988mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రుల యుద్ధతంత్రము తురకల యుద్ధతంత్రముకన్న చాలా వెనుకబడి లోపభూయిష్ఠమై యుండెననుటలో సందేహములేదు.

కళలు

నిర్మాణ శిల్పము, విద్యలు, చిత్రలేఖనము, చేతిపనులు, కళలుగా బరిగణింపబడి యిందు వ్రాయనయినది. కాకతీయ కాలములో ఆంధ్రుల ఉత్తమోత్తమ శిల్పములు బయలుదేరెను. అంతకుముందు ప్రాక్పశ్చిమ చాళుక్య రాజులు అనేకశివాలయములను కట్టించి, ఉన్నవాటిని సవరించి వాటివి భూదానములు చేసి యుండిరి. ఓరుగంటి రాజులును వారి సామంతులును అనేక దేవాలయములను నిర్మించి శాసనములను వ్రాయించిరి. కాకతీయుల రాజధాని తెలంగాణ మందుండుటచే అచ్చటనే దేవాలయ శిల్పము లెక్కువగా లభిస్తున్నవి.

ఓరుగంటి నగరమును ఆంధ్రనగర మని పిలిచిరి. మరేనగరమునను ఇట్టిపేరు లేకుండుటను జూడ ఓరుగంటి రాజులకు ఆంధ్రాభిమానము చాలా ఉండెననవచ్చును. ఆ నగరమునకు ఏడుకోట లుండెనందురు. లోపలి రాతికోటలో చక్రవర్తి వసించుచుండెను. ఆ కోటకు బయటిభాగమున చిన్నకులములవారి మైలసంత వారమున కొకమారు జరుగుచుండెను. లోపలి భాగములో మడిసంత జరుగుచుండెను. రాజవీథులు కొన్ని, సందులు కొన్ని యుండెను. పరిఖ, ప్రాకారము, వంకనార, గవని, కల ఆ కోటలో రథ, ఘోట, శకట, కరటి యూధసంచార ముండెను.[1] రాజమార్గంబు వారణఘటా ఘోటక శకటికాభటకోటి సంకలంబు; క్రంత త్రోవల నొండు కలకలంబులు లేవు; వేశ్య వాటిక మధ్యవీధి, మధ్యభాగములో స్వయం భూదేవాలయ ముండెను. దానిని తురకలు ధ్వంసము చేసిరి. దానికి నాలుగుదిక్కుల హంస శిఖరములతో నుండిన పెద్ద శిల్ప శిలా స్తంభముల మహాద్వారము లుండెను. అందిప్పుడు రెండుమాత్రమే మిగిలినవి. నగరము చాలా సుందర నిర్మాణములతో నిండినట్లు కావలసినన్ని నిదర్శనములు లభిస్తున్నవి. క్రీ.శ. 1721 లో తురక సేనాని యగు అలూఫ్‌ ఖాన్ ఒకమిట్టపై నెక్కి ఓరుగంటిలోని భాగమును పరీక్షింపగా నాతనికిట్లు కనబడెనట!

  1. క్రీడాభిరామము.