పుట:Andrulasangikach025988mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గెలుచుకొనిరి. ఆంధ్రులకు బల్లెము, కత్తియే ప్రధానమగు ఆయుధములై యుండెను. ఆనా డిట్టి పరికరా లుండినందున కోటల యవసరముండెను. గణపతిదేవుడు మొదట ఓరుగంటి కోటను కట్టెను. దానిని రుద్రమదేవి పూర్తిచేసెను. లోపలి రాతి కోటను పెద్ద కోట యనియు, బయటి మట్టిప్రాకారమును భూమికోట యనియు పిలుచు చుండిరి. మట్టికోట సామాన్యమైనది కాదు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ క్రీ.శ. 1296 లో మలిక్ కాఫిర్ సేనానిని ఓరుగంటిపై దాడిచేయ నియోగించెను. ఈ మలిక్ కాఫిర్ ఎవరు? ఇతడు మొదట హిందువు, అన్పృశ్యుడు. తర్వాత ముసల్మానై, మహాసేనానియై వేలకొలది హిందువుల చంపి, హిందూరాజ్యముల నాశనముచేసి, తన కసితీర్చుకొనెను. వాని సైన్యము మట్టికోటపై బడి దానిని పడగొట్టజూచెను. "కాని ఉక్కు బల్లెములతో దానిని బొడిచినను, బేటు (పెడ్డ) కూడా రాలకుండెను. గుండ్లను దానిపై వేయించినను అవి పిల్లలాడుకొను గోలీలవలె వెనుకకెగిరి పడుచుండెను."[1] ఈ కోట గోడ వైశాల్యము 12,546 అడుగులట!

ఓరుగల్లుకోటనుండి ముట్టడివేసిన తురకలపై నిప్పుతో కరిగిన వేడి ద్రవమును పోయిచుండిరట. తురకలు 'మాంజనీకులు' ఉపయోగించిరి. ఓరుగంటివారు అరద్ద లుపయోగించిరి. ఈ రెండును రాళ్ళు రువ్వుటకై యేర్పాటుచేసిన వడిసెలవంటివై యుండెను. ఏలన, ఖుస్రూ వాటిని గురించి యిట్లు వ్రాసెను. "ముసల్మానులరాళ్ళు వేగముగా ఆకాశమం దెగురుచుండెను. హిందువులగుండ్లు బ్రాహ్మణుల జందెములనుండి విసరబడిన వానివలె బలహీనములై యుండెను."[2] ఈ మంజనీకులు పాశ్చాత్యదేశాలనుండి దిగుమతియై యుండెను. వాటిని ఉభయ సైన్యము లుపయోగించెను.

అగ్నితోడియుద్ధము మొదట వరంగల్లు పైననే ప్రయోగింపబడెను. ఇది తర్వాత ఫిరంగీలకు, తుపాకులకు నాందీ ప్రస్తావన యనవచ్చుమ. 'అతీష్‌మీరేఖ్తంద్, (ఉభయులును ఆగ్నిని చిమ్ముచుండిరి.) అని ఫార్సీ చరిత్రకారుడు వ్రాసెను. ఆంధ్రసైన్యములో స్తోత్రపాఠకులు తమనేర్పును జూపు చుండిరి. వారిని "బర్దులు" అనుచుండిరి.

  1. ఖజానుల్ పుతూహె అమీర్ ఖుస్రూ.
  2. తారీఖె ఫీరోజ్‌షాహి - బర్నీ.