పుట:Andrulasangikach025988mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నల్లగొండ సరిహద్దులోనే కార్యంపూడి ఆంధ్ర కురుక్షేత్రముండెను. అందుచేత వారందు గానవచ్చినాడు.

కర్ణాణ కిరాతులుగా బరిగణింపబడిన బోయలు కాకతీయ కాలములో లేరన్నమాట. వారు కర్ణాటదేశీయులు కాన విజయనగరకాలమందే వారు కనిపించినారు. రాయచూరు జిల్లాలోని సురపురము అను "బేండర్" (బోయ) సంస్థాన ముండెను. సీపాయివిప్లవ మను అభాసనామము కల క్రీ.శ. 1857 నాటి స్వాతంత్ర్య విప్లవముతో ఆ సంస్థానము మాయమయ్యెను. ఆసమయమున దాని విచారణకర్తగా నుండిన మెడోస్ టెయిలర్ అను ఆంగ్లికోత్తముడు తన స్వీయచరిత్రలో అ రాజరికపు బోయలకు బావులలో దేవాలయములలో ప్రవేశము లేకుండెననియు, వారిని అంటరానివారినిగా హిందూ హిందువులు పరిగణించిరనియు వ్రాసెను. నూరేండ్ల లోపలనే ఆ బోయజాతి అంటరానితనము మాయమయ్యెను.

రుంజలు అనువా రుండిరి. వారు నగారావంటి రుంజ వాద్యమును మ్రోయించువారై యుండిరి. వారిని పల్నాటి వీరచరిత్రలోను, పాల్కురికి రచనలలోను పేర్కొన్నాడు.

పిచ్చుకుంట్ల వా రను నొక తెగవారు కలరు. నేడు వారు రెడ్లగోత్రాలను తంబూరాపై పాటలుగా చెప్పుచుందురు. పాల్కురికి కాలములో వీరు వికలాంగులైన బిచ్చగాండ్లు!

      " .... .... .... మాకు
       వీవంగ చేతులు లేవయ్య, నడచి
       పోవంగ గాళ్ళును లేవయ్య, అంధ
       కులమయ్య, పిచ్చుకగుంటులమయ్య"

" దాన మొసంగరే ధర్మాత్ములార" అని వారు బిచ్చమడిగినారు[1] పంబల, బవని, మేదర, గాండ్ల మున్నగు కులాలు చాలా గలవు. కాని అవన్నియు వృత్తులనుబట్టి యేర్పడినందున వృత్తుల చర్చలో వారినిగూడ చర్చించవచ్చును.

  1. పండితారాధ్య చరిత్ర, 2 - వ భాగము, పుట 348