పుట:Andrulasangikach025988mbp.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నందురు. చెట్టి, సెట్టి అను పదములు చాళుక్య కాకతీయుల కాలములో వీర శైవులగు బలిజలకు కులబిరుదముగా నుండెను. నేటికిని బలిజసెట్టి అని వాడుకలో నున్నది. తర్వాత కోమట్లు అ బిరుదమును శైవముతోపాటు స్వీకరించి నట్లున్నది. గౌరశబ్దమును క్రీ.శ.1600 ప్రాంతమందుండిన శుకసప్తతికారుడగు పాలవేకరి కదిరీపతి ప్రయోగించెను.

కోమట్లు బెంగాలులోని గౌడదేశమునుండి క్రీ.శ. ఆరు ఏడు శతాబ్దములలో ఆనాటిరాజుల దుష్టపాలనకు తాళజాలక సముద్రముపై వచ్చి తెనుగుతీరములలో దిగి గౌరలై, తర్వాత జైనమతావలంబులై, గోమఠానుయాయులై, కోమటులై యుందురు. వారి కులదేవతయగు కన్యకాంబను విష్ణువర్ధనుడను రాజు బలాత్కరించెనన్న కథనుబట్టియు వారు క్రీ.శ. ఆరేడు శతాబ్దుల కాలమందు వచ్చిరని యనవచ్చును.

వీరుకాక మరికొన్ని జాతులవారు ఈ కాలపు వాఙ్మయములో పేర్కొనబడినవారు. బోయవారు అను జాతి కొంత సందిగ్ధమునకు తావిచ్చును. విజయనగరకాలములో బేండర్‌బోయ అను జాతి యుండెను. బోయలు వేటకాండ్లని, అటవికులని, క్రూరులని విజయనగర కాలమునుండి కవులు వర్ణిస్తూ వచ్చినారు. కరీంనగరు, నల్లగొండ జిల్లాలలో ప్రధానముగా నివసిస్తున్న బోయీలు అను జాతివారు కలరు. భోజశబ్దభవులు వీరే అని కొందరన్నారు. ఇంగ్లీషువారు మద్రాసులో దిగినకాలములో వారివద్ద ఈ బోయీలే నౌకరులైనందున వారు వీరిని బాయ్ (Boy) అని పిలిచినందున ముసలి నౌకర్లనుగూడ ఇంగ్లీషువారు బాయ్ అనియే యందురు.

పలనాటి వీరచరిత్రలో బాలచంద్రునితో దెబ్బలుతిని పారిపోయినవారిలో కొంద రిట్లు పలికి తమప్రాణాలు కాచుకొనిరి.

         "బోయవారము మేము పూర్వంబునందు
          బుజములు కాయలు పూని కన్గొనుడి"

భోయీలు నిన్న మొన్నటివరకు పల్లకీలను (మేనాలను) మోసినవారు. కావున క్రీ.శ. 1172 ప్రాంతములో వీరు అదేవృత్తిలో జీవించినవారు. పైగా