పుట:Andrulasangikach025988mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకను నిట్టిదేవతలకు కొదువ లేకుండెను. మతమునకు సంబంధించిన కులాలను గూర్చి యిచ్చటనే కొంత తెలుపుదును.

అష్టాదశసంఖ్య కేలనో ప్రాధాన్యము కలిగినది. హిందువులలో 18 కులముల వారు ముఖ్యులుగా నుండిరని నాగులపాటి శాసనములో నిట్లు వ్రాసినారు.

"ఆ యూరి పదునెన్మిది సమయాల సమస్త ప్రజాసురంగభోగానికై" దానము చేయబడెను. అందీ క్రిందిజాతులు పేర్కొనబడినవి - కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు, (అగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మరవారు. ఈ కులాల విషయము చర్చింప నవసరములేదు. కాని కోమట్ల విషయము మాత్రము కొద్దిగా చర్చింతును. కోమటిపద మెట్లేర్పడెనో సరిగా జెప్పజాలము. గోమఠమునుండి గోమఠేశ్వరుడను జైన తీర్థంకరునినుండి యేర్పడినదని కొందరూహచేసిరి. అంగస్వరూప శాస్త్రమును (Ethnology) బట్టి వారిలో ఆర్యలక్షణాలు కానరావని తచ్ఛాస్త్రవేత్త లభిప్రాయపడుటకు వీలున్నది. తెనుగు దేశములో మొదటిసారి కోమటిపదము క్రీ.శ. 1150 కి లోనుగా నుండినట్లు శ్రీ మానపల్లి రామకృష్ణకవిగారిచే నిర్ణయింపబడిన భద్రభూపాలుని నీతిశాస్త్ర ముక్తావళిలో కానవస్తున్నది.[1] తర్వాత నీశబ్దము పల్నాటి వీరచరిత్రలో కానవస్తున్నది. పల్నాటియుద్ధము క్రీ.శ. 1172 లో జరిగెనని శ్రీ అక్కిరాజుగారన్నారు.

తర్వాత పాల్కురికి సోమనాథాదుల కృతులలో బహుళమయ్యెను. కోమటికి పర్యాయపదము భేరి[2], బచ్చు, నాడెకాడు[3] అని పూర్వులు వ్రాసిరి. ఇంతకుమించి వ్రాయలేదు. కాని ఒక ముఖ్యమగు పర్యాయపదమును మాత్రము పూర్వులు వ్రాసినవారుకారు. కోమట్లను గౌరులని, చెట్లు (సెట్టి) అనియు

  1. "బద్దెనీతియు కోమటి పడుచునోళ్ళ, కతన దబ్బర పాఠంబు గదియ గవులు, తప్పు లెడలింప నెంతయు నొప్పు భువిని." - నీతిశాస్త్రము 1 వ పద్యము.
  2. ఆంధ్రనామ సంగ్రహము, మానవవర్గు.
  3. సాంబనిఘంటువు, మానవవర్గు.