Jump to content

పుట:Andrulasangikach025988mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసకులే కాక, పౌరాణికులే కాక, మధ్యకాలమం దేర్పడిన కులతత్త్వ ప్రచారకులుగా గూడ నుండినట్లు ఊహింప వీలగుచున్నది.

కాకతీయుల కాలములో జైన బౌద్ధ సమయముల (సాంప్రదాయముల) వారే కాక యింకను పలుసమయముల వారుండిరి. అద్వైతవాదులు, బ్రహ్మవాదులు, పాంచరాత్ర వ్రతులు, ఏకాత్మవాదులు, అభేదవాదులు, శూన్యవాదులు, కులవాదులు, కర్మవాదులు, నాస్తికులు, చార్వాకులు, ప్రకృతి వాదులు, శబ్ద బ్రహ్మపరులు, పురుషత్రయైవాదులు[1], లోకాయతులు[2], మున్నగు మతావలంబు లుండిరి.

కాకతీయ కాలమందు తెనుగు సీమలో వీరశైవులు తమ మతప్రచారార్థమై గోళకి మఠముల నేర్పాటుచేసిరి. ఈ మఠమువారిలో కొందరు మహాపండితులై, గురువులై, విద్యాభోధకులై వెలసిరి. గోళకీమఠములందు శైవసాంప్రదాయ బోధను శాస్త్రవిద్యను సంస్కృత భాషలో నేర్పించుచుండిరి. ఒక విధముగా నవి వీరశైవుల గురుకులముగా పరిణమించియుండెను.

గోళకీమఠాల పోషణకై రాజులు గ్రామాలను, ధనికులు భూములను దానముచేసి శాసనములు వ్రాయించిరి. తర్వాతి కాలములో జంగాల మఠాలుండెను.. కాని 'గోళకి' పేరుమాత్రము మృగ్యమయ్యెను. పాలమూరు జిల్లాలోని గంగాపురములో అతిశిథిలములై దిబ్బలై మిగిలిన రెండు గుళ్ళు కలవు. వాటిని స్థానికులు "గొల్గక్క గుళ్ళు" అందురు. శబ్దసామ్యముపై నొక వెర్రి కతను కల్పించిరి. ఒక గొల్లవన్నెలాడిని అచట శివుడు కామించి భోగించి, ప్రతిఫలముగా పట్టిన పిడికెడు అనుదినము బంగారమగునట్లు వరమిచ్చెనట: అంత నా 'గొలక్క' లేక గొల్లత్త ఆ గుళ్ళను కట్టించెనట | యథార్థ మేమన, అవి గోళకీమఠములై యుండును. లేదా వాటి సమీపమున నా కాలమునందు గోళకీమఠాలుండెనేమో : గోళకీమఠ గురువులు శివదీక్ష నొందిన బ్రాహ్మణులుగా కానవస్తున్నారు.

  1. సిద్ధేశ్వర చరిత్ర.
  2. పండితారాధ్య చరిత్ర, మొదటి భాగం పు॥ 511