పుట:Andrulasangikach025988mbp.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము 1

ఆంధ్రపభ సంపాదకీయము

1945 నవంబర్ 22, మంగళవారం

మన తాత ముత్తాతలు

ఏరాజు ఎప్పుడు పాలించాడు? ఎక్కడ? ఏవిధంగా? అతడు ఎన్ని యుద్ధాలను చేశాడు? ఎవరెవరిని గెలిచాడు? లేదా, ఎవరిచేతిలో ఓడిపోయాడు? అత డెందరిని వివాహ మాడాడు? మరెందరిని ఉంపుడు కత్తెలను చేసుకున్నాడు? బహుభార్యాత్వపు సాధక బాధకాలను ఏవిధంగా ఎదుర్కొనాడు - ఇదే ఇప్పటి వరకు మన చరిత్ర.

"నా విష్ణు: పృథ్వీపతి:" అని విశ్వసించబడినంత వరకు రాజుల రాజాస్థానాల కథలే, రాణుల, రాణి వాసాల గాథలే చరిత్ర కావడం ఎవ్వరికీ ఎబ్బెట్టుగా తోచలేదు కూడా.

కాని, రాజు దైవాంశసంభూతుడన్న గుడ్డినమ్మకంరోజులు పోయాయి. చివరికి జపానులో కూడా (మొన్నటి యుద్ధము తర్వాత) హిరోహిటో సయితం సాక్షాత్తు అపరబ్రహ్మ స్వరూపుడన్న మూడ విశ్వాస ప్రాబల్యం సడలింది.

రాజుల రోజులు పోయినందున, ప్రజలే రాజులౌతున్నందున, ఇక చరిత్ర స్వరూపమే మారిపోవాలి. ఇక మీదట చరిత్రకారులు మనకు చెప్పవలసింది ముసలిమగడు రాజరాజ నరేంద్రుని పడుచు పెండ్లాం చిత్రాంగి సవతికుమారునిపై కన్ను వేసిందో, లేదో - ఈ సంగతి కాదు. ప్రతాప రుద్రుని ఉంపుడుకత్తె (ప్రతాపరుద్రుని ఉంపుడుకత్తె చరిత్రను "ఆడుదురు నాటకంబుగ నవనిలోన" అన్నాడు క్రీడాభిరామకర్త) విషయమై కాదు. కృష్ణదేవరాయల దేవేరుల విషయమై కాదు; ఆ దేవేరుల మధ్య వివాదాలను గురించి అంతకంటె కాదు.