పుట:Andrulasangikach025988mbp.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు. ఆ రాయలసీమ కన్నను మరీ చాలా వెనుకబడినవారు తెలంగాణావారు. వారి పాలిట బడిన ప్రభుత్వమే వారి పురోభివృద్ధికి ముఖ్యకారణ మనవలెను.

ఆంధ్రుల 900 సవత్సరాల సాంఘిక చరిత్ర సంగ్రహముగానే తెలుపనయినది. వ్రాయదగిన విషయము లింకను కలవు. అందుకు తగిన పండితులు కృషిచేసి మన సాంఘిక చరిత్రలు వ్రాసిన మనలో సాంఘిక చరిత్రలులేని లోపము తొలగిపోవును.

         సీ. పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ
            గౌతమీ గంభీర గమనమునకు
            అలంపురీ నందనారామ విభ్రాజి
            మల్గోబఫలరాజమధురరుచికి
            ఆంధ్రీకుమారీ సమాయుక్త పరిపూత
            తుంగా వయస్సు మాధుర్యమునకు
            ఖండశర్కరజాతి, ఖర్జూర, గోక్షీర,
            ద్రాక్షాదియుత రాఘరసమునకును
            అమృత నిష్యంది వల్లకీ హ్లాదమునకు
            రాగిణీదివ్య సమ్మోహరాగమునకు
            తేనెతేటల నవకంపు సోనలకును
            సాటియగును మా తెనుగు భాషాతల్లి,
(మదీయము)

(అంధ్రీనది=తుంగభద్ర కుపనది, రామరసము=మహారాష్ట్రుల మదుర రసము. జాజికాయ, జాపత్రి, ఏలకులు, బాదాము, ద్రాక్ష, పాలు, దోస, సొర, కరెపుచ్చ మున్నగువాటి విత్తులు, సొంఠి, చక్కెర, కుంకుమ పువ్వు ఇంకా చాలావస్తువులు నూరి కలిపిన దాన్ని రామరస మందురు. అలంపూరు బనగానపల్లె రెండును ముల్లోబ, దిల్‌పసందు అను శ్రేష్ఠమగు మామిడి పండ్లకు సుప్రసిద్ధ స్థలాలు.)