పుట:Andrulasangikach025988mbp.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాల్యవివాహాలు, వితంతుద్వాహ నిషేధము, సహగమనము, బహువిధ మూర్తుల పూజ, అనేక శక్తుల పూజలు, దేవర్ల కొలువులు మంత్రతంత్ర విశ్వాసములు, సముద్రయాన నిషేధము, కుల బహిష్కార దౌర్జన్యాలు, గ్రహచార విశ్వాసము, గ్రహశాంతులు శుభాశుభ శకునాలు పాటింపులు, అంటరానితనము, దృష్టిలోపాలు తాంత్రిక వామాచారాలు, మున్నగు ననంత లోపాలు సంఘమందు స్థిరపడి యుండెను. ఈ లోపాలవల్ల మనలో ఐకమత్యము, నాగరికతాభివృద్ధి, నిర్మాణ కౌశలము నశించి, రాజకీయ పతనము సంభవించెనని విద్యావంతులు తలచిరి. అందుచేత పారతంత్ర్య విముక్తికి ముఖ్యసాధనము సంఘలోపముల సంస్కారమని తలచిరి. దానికై సంఘ సంస్కార మహాసభలు విరివిగా కావించిరి.

ఇది యిట్లుండ క్రీ.శ. 1885 లో అఖిలభారత జాతీయ మహాసభ (నేషనల్ కాంగ్రెసు) స్థాపితమయ్యెను. 1857 తర్వాత అతిముఖ్యమగు ఘట్ట మీ కాంగ్రెసు సంస్థాపన. భారత జాతీయత (Nationalism) ఆనాటి నుండి ప్రారంభమైనదన్నమాట. భారత దేశమును సృష్టికర్త తన పరిశీలన గృహము (లేబరేటరీ) గా బహుశా నిర్ణయించుకొన్నాడేమో. వివిద జాతులు, కులాలు, మతాలు, భాషలు - ఇచ్చటనే సమకూడినవి. వేదకాలమునుండి భారతీయులలో అఖండ జాతీయత యెన్నడును కలిగి యుండలేదు. కావున కాంగ్రెసు అవతరణ యీ జాతీయతకు పునాదివేసెను. యూరోపులోని జర్మనీలో ఫ్రెడరిక్ (The Great) తోను, ఇటలీగారి బాల్డీ, మాక్జినీలతోను, ఫ్రాన్సులో 1789 నాటి విప్లవముతోను సంయుక్తామెరికాలో 1776 తోను జాతీయత ఏర్పడెను. మన కాంగ్రెసు మొదట సంఘ సంస్కారమునకు పూనుకొనలేదు. దాని వార్షిక సభలతోపాటు వేరుగా సంఘ సంస్కార సభలు జరుగుచుండెను.

ఇంగ్లీషు పరిపాలనము ఆర్థికముగా దేశానికి గొప్పనష్టము కలిగించెను. మన దేశములోని పరిశ్రమలు నాశనమయ్యెను. కొత్త పరిశ్రమలను ఇంగ్లీషువారణగ ద్రొక్కిరి. అందుచేత జనులు అత్యధికముగా భూమిపై వ్యవసాయముపై ఆధారపడిరి. దేశమందు క్షామములు అభివృద్ధియై జననష్ట మపారమయ్యెను. విలియం డిగ్బీఅను ఆంగ్లేయుడు 1891లో పార్లమెంటు సభ్యుల పేర ఒక విజ్ఞప్తి ప్రకటించెను. అందిట్లు వ్రాసెను. '1802 నుండి 1854 వరకు 13 క్షామాలు సంభవించి 50 లక్షలమంది చచ్చిరి. 1860 నుండి 1879 వరకు 16 క్షామాలు సంభవించి 1 కోటి 20 లక్షల మంది చచ్చిరి. 1868 లో