పుట:Andrulasangikach025988mbp.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిషనరీలు, ఫాద్రీలు, తమ మతము గొప్పదనియు ప్రచారము చేసుకొనుటలో తృప్తినొందక హిందువుల కులాచార లోపములను మూర్ఖ విశ్వాసములను సంఘములోని కుళ్ళును బయట పెట్టి దుష్ప్రచారము చేసి జనులలో హిందూమతముపై విశ్వాసమును భక్తిని ఆదరమును పోగొట్టుతూ వచ్చిరి. అందుచేత ఇంగ్లీషు విద్య నేర్చినవారిలో తమ మతముపై అభిమానము తగ్గిపోయి తమ కొంచెపుతనమునకు తాము లజ్జింప మొదలిడిరి. అట్టి సన్నివేశములో భారత రంగముపై ఒక మహావ్యక్తి ఆవిర్బవించెను. అతడే మహర్షి శ్రీమ ద్దయానంద సరస్వతీ భగవత్పాదులు. వారి కింగ్లీషేమియు రాకుండెను. సంస్కృతమందు పారమందినవారు. వేదశాస్త్రములను సంపూర్ణముగా స్వాధీన పరచుకొనిరి. అతడాధునిక కాలపు దృష్ట. అత డార్యసమాజమును స్థాపించి హిందువులలోని ఆచార లోపాలు మధ్య వచ్చినవే కాని వేదమూలకములు కావని నిరూపించి ఇస్లాంక్రైస్తవమతాలలో కల ఆధ్యాత్మికాధిభౌతిక లోపాలను నవితర్కముగా నిరూపించి హిందువులకు ధైర్యము, సంస్కారావకాశము, ఆత్మ గౌరవము కలిగించెను. తెనుగు దేశ మందు నిన్న మొన్నటి వరకు ఆర్యసమాజ ప్రచారము సాగినదికాదు.

ఆర్యసమాజానికి ముందే రాజా రామమోహనరాయల బ్రహ్మసమాజ శాఖలు కృష్ణా గోదావరి జిల్లాలలో కొన్ని స్థాపిత మయ్యెను. కాని, వానికి వ్యాప్తి లేక ఆగిపోయెను. అయినను ఆర్య బ్రహ్మ సమాజముల భావములు జనులలో బాగా వ్యాపించిపోయెను. బ్రహ్మ సమాజములో చేరినట్టి కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఒక అసాధారణ వ్యక్తి. మహానుభావుడు. 'వీరా: పండిత కవయ:' అన్న సూక్తికి లక్ష్యభూతుడు అతడు కులముల తారతమ్యములమీద మూడ విశ్వాసాలమీద, అవైదికమగు మూర్తిపూజలమీద దెబ్బతీసెను. స్త్రీలపై జరుగు హత్యాచారముల ముఖ్యముగా వితంతువులకు పునర్వివాహము చేయక నిరోధించుటను ప్రతిఘటించి వితంతూద్వాహములను చేయించి, వితంతు శరణాలయమును నెలకొల్పెను. ఆయన ప్రచారము వలన తెనుగుదేశ మందపూర్వ సంచలనము కలిగెను. పూర్వాచారపరులు ఆంక్షలుపెట్టి, అల్లరులుచేసి, దౌర్జన్యాలు చేసి, బీభత్సము చేసినను అతడు మరింత విజృంభించి తనదీక్షను సాగించెనే కాని విరమించుకొన్నవాడు కాడు.

హిందువులలో ఇంచుమించు 1000 ఏండ్లనుండి అనగా ముస్లిములు దేశమందు ప్రవేశించిన కాలమునుండి అనేక దురాచారాలు ప్రబలిపోయెను.