పుట:Andrulasangikach025988mbp.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8వ ప్రకరణము

క్రీ.శ. 1857 నుండి 1907 వరకు

భారతీయుల కత్తి 1757 లో ప్లాసీయుద్ధములో లొగిపోయెను. 1857 విప్లవములో విరిగిపోయెను. మరల 1947 లో మనకత్తి మనచేతికి వచ్చెను. 1857 లో ఇంగ్లీషురాజ్యము దేశమంతటను స్థిరపడిపోయెను. ఇది మనదేశచరిత్రలో ముఖ్యమగు ఘట్టము. మన మానాటినుండి ఆధునిక యంత్ర యుగములోనికి ప్రవేశించినాము. ఈ 60 ఏండ్ల చరిత్ర విద్యావంతుల కందరికినీ బాగా పరిచితమైనదే. అందుచేత ఈ భాగమును 1907 వరకు ముగించుట బాగని తలపనయినది. అనగా విప్లవము తరువాత 50 ఏండ్ల సాంఘిక చరిత్ర సంగ్రహముగా నీ ప్రకరణమున వ్రాయబడును.

1857 కు పూర్వముండిన ముస్లిం మతవ్యాప్తి ఆనాటితో ఆగిపోయెను. ఇంగ్లీషువారు క్రైస్తవులు. కాన క్రైస్తవ మతవ్యాపక సంఘములు (మిషనులు) అనువయిన స్థలములందంతటను స్థాపితమయ్యెను. మిషనరీలు నానావిధములగు సేవలద్వారా జనులను తమ మతములోని కాకర్షించిరి. వారు విద్యాలయముల స్థాపించిరి. వైద్యాలయముల నెలకొల్పి ఉచితముగా మందు లిచ్చిరి. తమ బైబిల్ మత గ్రంథమును భారతీయ భాష లన్నింటిలోనికి పరివర్తనము చేసి ముద్రించి ఉచితముగా పంచిపెట్టిరి. వారి మతములోనికి విశేషముగా అంటరాని తెగలవారు చేరిపోయిరి. తెనుగు దేశమందు 200 ఏండ్లనుండి క్రైస్తవ మత ప్రచారము సాగుతూ వచ్చినది. క్రైస్తవ మతములో చేరిన పై జాతులవారు తమ కులాలను మరచిపోజాలరయిరి. గుంటూరుజిల్లాలో వేలకొలది రెడ్డి కుటుంబాలు క్రైస్తవమతం పుచ్చుకొనెను. కాని వారు అదే మత మవలంబించిన మాల మాదిగ మంగలి మున్నగు తక్కువ జాతులతో బాంధవ్యము నేటివరకు చేయుట లేదు. అందింకొక చిత్రమేమన హిందువులగు రెడ్లు తమకన్యల ఆ రెడ్డిక్రైస్తవులకిచ్చి పెండ్లిచేయుదురు. కాని క్రైస్తవ రెడ్లు మాత్రము తమ పిల్లల హిందూ రెడ్ల కీయరు.