పుట:Andrulasangikach025988mbp.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జెనూయిట్ క్రైస్తవులు మలబారులో తమ బైబిల్ గ్రంథమును మళయాళీ లిపిలో అచ్చువేసిరి. 1679లో కొచిన్‌లో తమిళ నిఘంటువు నచ్చువేసిరి. తెనుగుభాషలో మొదటి అచ్చుపుస్తకముకూడా బైబిలే అయియుండును కాని మనకు తెలియదు. క్రీ.శ. 1807 లో తెనుగు వ్యాకరణ మచ్చుపడెను. 1856 లో కాల్డ్వెల్ అను ఇంగ్లీషు పండితుడు తమిళమును అభ్యసించి "ద్రావిడ భాషల వ్యాకరణము" అను భాషా తత్త్వశాస్త్రమును వ్రాసెను. ఈనాడు దానిని తప్పులు పట్టువారు బహుళము. కాని ఒక విదేశిపండితుడు మన భాషల నేర్చుకొని వాటిని చక్కగా గ్రహించి పరిశోధించి ఒక భాషాశాస్త్రమును 90 ఏండ్ల క్రిందట వ్రాసెనని అతని ప్రజ్ఞ అతనియుపజ్ఞ శతథా ప్రశంసింపతగినవి. ఇదే కాలములో బ్రౌన్ అను ఇంగ్లీషువాడు మన తెనుగులో చాల గొప్ప పాండిత్యమును సంపాదించి ఆంధ్ర నిఘంటువును, వ్యావహారిక కోశమును వ్రాసెను. ప్రాచ్య లిఖిత పుస్తకాగారానికి అతడే జనక స్థానీయుడు, అతని పుణ్యమా అన్నట్లు ఎన్నో ఉత్తమ గ్రంథాలు సేకరింపబడి రక్షింపబడెను. అతడు మెచ్చుకొన్న గ్రంథము వేమన పద్యాలు. వాటిని ఇంగ్లీషులోనికి అనువదించి ప్రకటించెను. ఇదే కాలములో మెకంజీ అను ఇంగ్లీషువాడు లోకల్ రికార్డులను (స్థానిక కైఫీయత్తులను) ఆంధ్రప్రాంతాలనుండి సమకూర్చి తెప్పించి యుంచెను. అచ్చుయంత్రాలకు మద్రాసు ముఖ్యస్థానమయ్యెను. నేటికినీ తెను గచ్చునకు మద్రాసే ప్రసిద్ధికాంచినది. ఇదేకాలమందు గద్వాలలో, వనపర్తిలో తెను గచ్చు యంత్రాలు స్థాపితమై గ్రంథాలు ముద్రిత మయ్యెను. ఈ రెండు సంస్థానములలోని అచ్చు యంత్రాలు యించుమించు 80 ఏండ్ల క్రిందటివి. ఈ రెండు సంస్థానాలున్నూ తెనుగు భాషకు చాలా గొప్ప సేవజేసినవి.

ముద్రణ విధానము మన సారస్వతాని కొక నూతన యుగము. దానితో మన భాషాభివృద్ధి విరివిగా అవుతూ వచ్చినది. కాన మన తాతల తరమువారు అచ్చుయొక్క గొప్పతనాన్ని ఏలనో గుర్తించి స్తుతించినవారు కారు. నస్యముపై, పొగాకుపై, నల్లిపై పద్యాలు వ్రాసినవారు అచ్చుపై కొన్ని అల్లియుండరాదా? ఈ విషయాలను గురించి శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి 'తెనుగు తోబుట్టువులు' అను గ్రంథమును, కాల్ డ్వెల్ గారి Grammar of Dravidian languages అను గ్రంథమును చదువవలెను.