పుట:Andrulasangikach025988mbp.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదియు ఉర్దూ పదమే. కొన్ని ప్రాంతాలలో వారిని ఉనుపులవారు అనిరి. తెలంగాణములో రంగ్రేజీ వారు కొల్లలుగా కలరు. వారు పూర్వము నీలి, ఎరుపు, లత్తుక, మున్నగురంగుల వాడిరి. పైగా మైకావంటి తళుకులను వాడిరి. ఈ తళుకులను ముసల్మాను లెక్కువగా పసందు చేసేవారు. ధనికులు బంగారు వెండి రేకులను రంగులతోపాటు చీరల కద్దించువారు. ఉతికినను పోనట్టుగా నిపుణతతో వాటి నద్దువారు. ఆధునిక కాలములో పూర్వపు కట్టెదిమ్మెలతోపాటు రాగిసీసము, జింకు పోతదిమ్మెలనుకూడా అధికముగా వారు వాడుతున్నారు. వారి రంగులన్నియు నిప్పుడు విదేశీ రంగులే.

ఈ సమీక్షాకాలములో ఒక్క హంసవింశతి తప్ప మన సాంఘిక చరిత్రకు పనికివచ్చు ప్రబంధములేదు. ఉత్తమ కవిత సన్నగిల్లెను. తంజావూరుకు తెనుగుసీమ కవులు కళానిదులు వలసపోయిరి. కాని ఇంగ్లీషు వారు తంజావూరును గూడా దిగమ్రింగిరి. కవితలో ఉత్తమరచన లీకాలమందు లేకున్నను ఒక్క త్యాగరాజు మాత్రము ఈ కాలమందు సంగీతమున కఖండ జ్యోతిగా దక్షిణా పథమందు వెలిగెను. త్యాగరాజు క్రీ.శ. 1759 నుండి 1847 వరకు ఇంచుమించు 88 ఏండ్లు జీవించినవాడు. అతడు తంజావూరు జిల్లాలోనివాడు. చిన్నతనమందు సొంటి వెంకటరమణయ్య అను ప్రసిద్ధాంధ్రగాయకునివద్ద సంగీత మభ్యసించెను. త్యాగరాజు రామభక్తుడు. నిజమగు త్యాగి. మాధుకరముచే జీవించెనేగాని రాజుల ప్రార్థనల నంగీకరించి వారి నాశ్రయించినవాడు కాడు. అతన్ని తంజావూరి మరాటారాజగు శరభోజియు, తిరువాన్కూరు రాజున్నూ తమ ఆస్థానాలకు రమ్మనికోరిరి. కాని "పదవి సద్బక్తి" అనే పాట పాడి రాముని పాదాలే తన యాస్థానమని వారి ప్రార్థనల నిరాకరించెను.

ఈ సమీక్షాకాలమందే కృష్ణాజిల్లాలో నారాయణ తీర్థులను ఆశ్రమ స్వీకారము చేసిన ఆంధ్రుడుండెను. అతడు కృష్ణలీలాతరంగిణిని సంస్కృతములో రచించెను. ఆ తరంగాలు తెనుగుదేశ మందే కొంత వ్యాప్తిగన్నవి. అతని పుస్తకమును తెనుగు లిపిలోనే (వావిళ్ళలో దొరకును) ముద్రించిరి. నాగర లిపిలో లేనందున దేశాంతరఖ్యాతి రాకపోయెను. అది జయదేవుని గీతగోవిందమున కే మాత్రమున్నూ తీసిపోదు. దాని కెక్కువ ప్రచారము కావించుట ఆంధ్రుని విధి.

ఇదే కాలమందే క్షేత్రయ్య తన పదములను వ్రాసెను. అవి జావళీలు శృంగార భూయిష్ఠములు. దేశమందు వ్యాప్తిలో నుండినట్టివి. క్షేత్రయ్యపదాలు