పుట:Andrulasangikach025988mbp.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిది. వారికి ముల్లెమూటల చీదార ముండకుండెను. సులభముగా తీసుకొని పొగలిగిన విలువగల వస్తువుల నన్నింటిని లాగుకొనెడివారు. వానకాలపు కార్తులందలి వానలవలె వారు తప్పకుండా ఏటేట గ్రామాలకు దర్శనమిచ్చి పొయ్యేవారు. పంటలు కోతల కెప్పుడు సిద్దమయ్యేది రైతులకంటే ముందుగా పిండారీలకే గుర్తు. కాన వారు తీరా కోతసమయానికి ప్రత్యక్షమై ధాన్యము నున్నగా ఊడ్చుకొని పోయెడివారు.

ఇంగ్లీషువారు బెంగాలు బీహారులను దోచుకొనుటలో నిమగ్నులై యుండిరి. తమ భాగాలలోనికి పిండారీలు రానంతవరకు వారికి చీమకుట్టినట్లు కాలేదు. అందుచేత పిండారీలు ఇంచుమించు 50 ఏండ్లవరకు నిరాఘాటముగా తమ ఉద్యమమును సాగించిరి. అప్పుడు ప్రజలే తమకు తోచినట్లు ఆత్మరక్షణము చేసికొనిరి. తెనుగు దేశములోని చాలా గ్రామలలో గ్రామస్వరూపము మారి పోయెను. గ్రామాలకు నాలుగు దిక్కులా బురుజులను కట్టి వాటికి మధ్య పెద్ద గోడలను నిర్మించి ఊరవాకిలి పెద్దగవని తలుపులతో గడెమ్రానితో నిర్మించిరి. చీకటి పడీ పడకమునుపే తముకువేసి ఊరవాకిండ్లు బంధించేవారు. అచ్చట తలార్లు బేగారీలు సేత్సందీలు కావలి కాసేవారు. కాని పిండారీలు పగలే వచ్చేవారు. అందుచేత బురుజులపై మచ్చెలువేసి కావలికాసి దూరాన దుమ్మురేగుట కానరాగానే నగారా వాయించి పొలాలలోనుండు జనులను గ్రామాలలోనికి రప్పించి ఊరవాకిలి బంధించి జనులు బురుజులపై గోడలపై నెక్కి యుద్ధానికి సిద్ధపడేవారు.

"పిండారీల సైన్యము 1814లో 20000 గుర్రపుదళము, 15000 కాల్బలము, 18 తోపులు కలదయ్యెను. 1816లో వారు ఉత్తర సర్కారులలో సగము భాగములో పదకొండున్నర దినాలపాటు 339 గ్రామాలు దోచిరి. ఆ రేడు వేలమందిని చచ్చుదెబ్బలుకొట్టి, దాచిన ధనము జాడలు తెలుసుకొనిరి. వారిదెబ్బ ఎక్కువగా గుంటూరు జిల్లాపై బడెను. వారి ఘోరాలకు తాళలేక నూర్లకొలది జనులు తమ ఆలుపిల్లలతోసహా తమగుడిసెల నంటుబెట్టి అగ్నిలో పడి చచ్చిరి. అందు తప్పించుకొన్న కొందరి బాలురవల్ల ఈ వార్తలు ఇంగ్లీషు కంపెనీ సర్కారుకు తెలియవచ్చెను. నూర్లకొలది స్త్రీలను పిండారీలు చెరచగా వారు అవమానాన్ని భరింపలేక బావులలో పడి చచ్చిరి.