పుట:Andrulasangikach025988mbp.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహన రాయలు బయలుదేరి బ్రహ్మసమాజస్థాపనముచేసి హిందూ సాంప్రదాయములలో జొరబడిన దురాచారాలను సంస్కరింప బూనెను. అంతకుముందే రామదాసు, కబీరు, గురుగోవిందు, మున్నగు వారు సంస్కరణలు ప్రవేశపెట్టి యుండిరి. వేమన, వీరబ్రహ్మము, యాగంటయ్య, మున్నగు యోగులు తెనుగు దేశమందు దురాచారాలను కులాలను, విభేదాలను, తీవ్రముగా ఖండించిరి. కాని పీఠాధిపతులుమాత్ర మెన్నడును సంస్కరణవిధాన మవలంబించినట్లు క్రీ.శ. 1500 నుండి నేటివరకు ఈ 500 ఏండ్లలో మనకు చరిత్రలో నిదర్సనాలు కానవచ్చుటలేదు.

అరాచకము

మొగలాయి సామ్రాజ్యము తటాలున కూలిపోయెను. నామకార్థపు చక్రవర్తిని మాహాదజీ సింధియను ఆ కాలపు వీరాధివీరుడు ఇంచుమించు తన బందీగా నుంచుకొని హిందూ సామ్రాజ్యమును డిల్లీలో ప్రతిష్ఠాపించెను. అది కొలదికాలమువరకే ! కాని స్థాపించినాడు ! అంతలో ఇంగ్లీషువారి విజృంభణము శరవేగముగా పైకి వచ్చెను. బెంగాలు, బీహారు, మద్రాసు, ఒరిస్సాభాగాల నాక్రమించుకొని మరాటీలను కూడా ఓడించిరి. మహారాష్ట్రాగ్రనాయకుడగు మాహాదజీ సింధియా ఇంగ్లీషువారి యుద్ధతంత్రమును బాగుగా గుర్తించి పూర్వపు మొగలాయి విధానాన్ని తన సేననుండి తొలగించి పూర్తిగా తూరోపు విధానాన్నే డీబాయిన్ అను ఫ్రెంచి సేనాని శిక్షణములోనే స్థాపించి ప్రబలుడయ్యెను. కాని అంతలోనే 1794 లో సింధియా మరణించెను. మహారాష్ట్రులలో కక్షలు, కలహాలు, కలతలు హెచ్చెను. వారిది దోపిడిరాజ్యమే కాని సురాజ్య మెన్నడునూ కాదు. అందుచేత ప్రజావలంబనము లేకుండెను. వారు రాజపుత్రులతో సఖ్యముచేయుటకుమారు వారిని బాధించి ఓడించి తామును దుర్బలులయిరి. ఈ పొరపాట్లచే వారు రంగమునుండి 1813 తర్వాత మాయమైరి. మహారాష్ట్ర సేనలోని వారు పలువురు తమ పూర్వమర్యాదను మరువజాలక పిండారీలుగా మారి దేశమును దోచిరి. పిండారీలఘాటు తెలంగాణము పైనను, రాయలసీమ పైనను, ఉత్తర సర్కారుల పైనను సమానముగా పడెను. వారు 200 నుండి 5000 వరకు గుంపుగా బయలుదేరి, గ్రామాలు ధ్వంసము చేసి దోచుతూ పోయెడివారు. వారు గుర్రాలమీద సవారిచేసి అతివేగముగా గ్రామాలమీద పడేవరకు జనులకు వారిరాక తెలియకుండె