పుట:Andrulasangikach025988mbp.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసిరి. క్రీ.శ. 1756 లో కర్నూలు జిల్లాలోని పత్తికొండను బసాలత్ జంగు అను నవాబు చిన్న తిమ్మన్న అనునతనికి జాగీరుగా నిచ్చెను. అతడు పైకము చెల్లించలేక తన భార్యను పిల్లలను జామీనులుగా బసాలత్ జంగువద్ద వదిలెను. బసాలత్ జంగు ఆ స్త్రీని పిల్లలను బలవంతముగా ముసల్మానులచేత వండించిన అన్నమును తినిపించెను. ఆ సంగతిని పీష్వాతో చెప్పుకొనగా వారిని విడిపించి శుద్ధి చేయించెను. కాని వాసప్ప అను పిల్లవాని మాత్రము బసాలత్ జంగు భార్య వదలక తురకనుచేసి రహ్మతలీఖా అను పేరు పెట్టి తనకొడుకుకు దివానుగా చేసెను (కర్నూలు మాన్యుయల్).

ఇస్లాం మతవ్యాప్తి తగ్గుతూవచ్చెను. క్రైస్తవ మతవ్యాప్తి హెచ్చుతూ వచ్చెను. క్రైస్తవులు ముసల్మానులవలె కత్తితోకాని తుదకు తుపాకీతో కాని మతప్రచారము చేయలేదు. కాని వారు బహువిధోపాయముల నవలంబించిరి. క్రైస్తవమిషనుల నేర్పాటుచేసి "ఫాదిరీలను (Fathers) నియమించి మతప్రచారము చేసిరి. అ ఫాదిరీలు భారతదేశమం దన్ని ప్రాంతాలలో వ్యాపించుకొని తాముండు ప్రాంతీయభాషను నేర్చుకొని తమ భైబిలును అన్ని దేశీ భాషలలోనికి అనువదించి ముద్రించి ఉచితముగా పంచి పెట్టిరి. వారు బిల్లు, సంతాల్, ముండా, గోండు, కోయ, సవర, తోడ, నాగ, చెంచు, మున్నగు అటవికులందును నివసించి వారి భాషలు నేర్చుకొని ప్రచారముచేసిరి. అటవికభాషలకు వ్యాకరణాలు, వాచకాలు వారు వ్రాసి ఆ భాషల నుద్ధరించిరి.

మిషనరీలు మొదటినుండియు హిందువులను వారి మతాన్ని, వారి ఆచారాలను దూషించి దుష్ప్రచారముచేసి అపకీర్తిపాలు చేస్తూవచ్చినారు. హిందువుల కులాలనుండి ముఖ్యముగా అంటరానితనమునుండి వారు చాలా లాభము పొందిరి. లక్షలకొలది అస్పృశ్యవర్గాలను తమమతములో కలుపుకొనిరి. అందేతప్పును కానరాదు. హిందువులు అంటరాని తనమును నెలకొల్పి తమకాళ్ళను తామే నరుకుకొన్నవారు. ఆ పాప ఫలితము నింకా అనుభవిస్తున్నారు. కాని క్రైస్తవ మత ప్రచారకులు హిందువులలో నాగరికతలేదని, వారు దయ్యాలను మంత్రాలను ఆశ్రయించిరని, వారి స్త్రీలు బానిసలని, శిశుహంతకులని, మూర్ఖ విశ్వాసాలతో నిండినారని, వారి మతమంతయు నిస్సారమైనదని వ్రాసి ప్రచారముచేసి అపచారము చేసిరి. మెకాలేవంటి మహా మేధావి హిందూ వేదాలు ఈసస్ కథలకు సరిరావనెను. ఇట్టి వాతావరణములో రాజా రామ