పుట:Andrulasangikach025988mbp.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మించు నామావశిష్ఠ మయ్యెను. కాని జైనమతము ప్రబలముగానే యుండెను. శ్రీమచ్ఛంకర భగవత్పాదులదెబ్బ తెనుగుసీమపై పడినట్లు కానరాదు. పైగా ఆతనికి సరిజోడైన కుమారిలభట్టుదే తెనుగు నాట పైచేయిగా నుండెను. కౌమారిలదర్శనమును ప్రచారమునకు తెచ్చిన ప్రభాకరుడు ఓడ్రదేశమువాడు. కుమారిలు డాంద్రుడు. గంజాముజిల్లాలో జయమంగళ గ్రామమువాడు. కౌమారిలులుకూడా జైనులకు ప్రబల శత్రువులు. అయినను జైను లను వారు రూపుమాపజాలినవారు కారు. ఆంధ్ర కర్ణాట దేశాలలో జైనులను నిజముగా ప్రధ్వంసము చేసినవారు వీరశైవులే. వారు శాస్త్రచర్చతో ఎక్కువగా పనితీసుకొన్నవారు కారు. జైనమతమందలి వర్ణరాహిత్యమును తమ ముఖ్య సిద్ధాంతముగా శైవులు స్వీకరించిరి. కాని శాస్త్రచర్చవల్లగాని ఆచార వ్యవహార స్వీకరణములవల్లగాని జైనులు లోబడనప్పు డా యహింసా వాదులపై వీరశైవులు హింసను ప్రయోగించుటకు వెనుకాడ లేదు. రాజులను వశపరచుకొని వారికి వీరశైవదీక్ష నిచ్చి, వారిగురువులై, మంత్రులై, దండనాయకులై, రాజ్యముల వశీకరించుకొని కథలతో, కత్తులతో, కల్పనలతో, బహువిధ విధానములతో, పరమత నిర్మూలనముతో వీరవిహారము చేసినవారు వీరశైవులే: జైన విగ్రహములను లాగివేసి వాటిస్థానములో లింగాలను బెట్టిరి. నగ్నజైన విగ్రహాలను కొన్నిటిని బహుశా వీరభద్రులగా చేసికొని యుండిన చిత్రము కాదు. నేటికిని కొన్ని తావులలో గుడిబయటి భాగమందు జైనవిగ్రాలుండుట అందందు చూచుచున్నాము. గద్వాలలోని పూడూరు గ్రామములో ఊరిబయటి గుడిముందుట నగ్నజైన విగ్రహాలను పెట్టి వాటిని "పూడూరి బయటిదేవర్లు" అని యందురు. అచ్చటనే ఊరిముందట "జైనశాసనము" అను శీర్షికతో చెక్కబడిన 800 ఏండ్లనాటి శాసనము కలదు. అదేవిధముగా వేములవాడలో జినాలయము శివాలయముగా మారి, పాపము అదిజైన విగ్రహాలు గుడి కావలిబంట్లవలె దేవళము బయట దరిదాపు లేనివైనవి. తెనుగు దేశములో అనేకస్థలములం దిట్టి దృశ్యము లుపలబ్ధమగును. జైననగ్న విగ్రహాలను హిందువులు చూచిన, వాటిపై మట్టిబెడ్డలు వేసి నగ్నతను కప్పుట కేమో బట్టపేలికనో, దారమునో వేసి పోవుదురు. జోగిపేట యనున దొక కాలములో పూర్తిగా జైన (జోగుల) బస్తీ. అచ్చట యిప్పటికి, జైనులున్నారు. కొలనుపాకలో సుప్రసిద్ధ జైనాలయము కలదు. హైద్రాబాదు నగరములోనే ప్రాచీన జైనాలయములు కలవు. వరంగల్‌లోను హనుమకొండలోను, హనుమకొండ గట్టుపైనను జైనవిగ్రహాలు చాల