పుట:Andrulasangikach025988mbp.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలు నాశనమగుట, అన్నియు ఈ కాలమందే జరిగెను. ఈ దెబ్బనుండి మనము నిన్న మొన్నటి వరకు కోలుకొన్నవారము కాము. మనలను ఇంగ్లీషువారు కోలుకోనిచ్చినవారు కారు. ఈ సమీక్షా కాలములో మొగలాయి రాజ్యముకన్న కంపెనీ రాజ్యమే ఘోరమైనదయ్యెను.

ఆచారములు

క్రీ.శ. 1757 నుండి యింగ్లీషు ప్రభుత్వము స్థిరపడుతూ వచ్చెను. దేశములో తీవ్రమగు మార్పులు ప్రారంభమయ్యెను. ముసల్మానుల ప్రభావము తగ్గినకొలది ఇంగ్లీషువారి ప్రభావము దేశముపై దేశజనుల ఆచారాలపై ఎక్కువగుతూ వచ్చెను.

కూచిమంచి తిమ్మకవి క్రీ.శ. 1750 తర్వాతవాడు. అతడు తన కుక్కుటేశ్వరశతకములో ఇట్లు విచార పడెను.

       'వేదశాస్త్ర పురాణ విద్యలక్కరగావు పరిహాస విద్యలు పనికివచ్చు
        గద్యపద్య విచిత్రకవితలు కొరగావు గొల్లసుద్దులకతల్ పెల్లుమీరు
        దేశీయ భాషలతీరు లేమియుగావు పారసీకోత్తులు ప్రణుతి కెక్కు
        శైవవైష్ణవ మతాచారంబు లొప్పవు పాషండమతములు పాళినలరు.'

గువ్వల చెన్న శతకము "గువ్వల చెన్నడను గొల్లవాడు రచించెనని కొందరు చెప్పుదురు. కవి పదునేడవ శతాబ్దాంతమున ఉండవోపు" అని వావిళ్ళ పీఠికలో కలదు. అనగా కవి క్రీ.శ. 1600 నుండి 1700 లోపల నుండెనని వారి అభిప్రాయము.

        గొల్లింట గోమటింటను తల్లియు దండ్రియు వసింప దాను వకీలై
        కీళ్ళ మదమెక్కి నతనికి గుళ్లయినం గానరావు గువ్వలచెన్నా!

అని కవి గొల్లవాడైన వ్రాసియుండడు.

కవి బ్రాహ్మణుడు కాడనియు రాయలసీమవాడు కాడనియు ఈ క్రింది పద్యము తెలుపుచున్నది.

         వెల్లుల్లి బెట్టి పొగచిన పుల్లని గోంగూర రుచిన బొగడగ వశమా
         మొల్లముగ నూని వేసుక కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా!