పుట:Andrulasangikach025988mbp.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           గోవుల పడమొత్తి కోసిముక్కలు మెక్కు
                సమదాంధులగు కొండసవరులైన
           తెరవాట్లు కొట్టి కత్తెర దొంగలై
           ..... ..... .....
                 చాల పాలించి తిరుగు చండాలురైన
                 ..... ..... .....
                 ఘాతుకత్వంబు సేయు ముష్కరులు గలరె"

ఆ కాలములో గట్టి కేంద్రరాజ్యము లేక తెనుగు దేశము చిల్లర పాలెగాండ్ర వశమయ్యెను. వారును పరరాజుల సామంతులైరి. ఇంగ్లీషు, ఫ్రెంచి, ముస్లిములు రాజ్యాలకై పోట్లాడుచుండిరి. అందుచేత దేశమంతయు అరాచకమై బందిపోటు దొంగతనాలు ఎక్కువయ్యెను. క్రీ.శ. 1600 ప్రాంతాన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అను ప్రభువు అమరావతిలో చిన్న రాజ్యమేలెను. మహాదాత యనియు, శూరుడనియు ఖ్యాతిగాంచెను. 'అటునుండి కొట్టుకరా' అనే సామెత ఇతని నుండే పుట్టినదట. 'ఆ కాలమందు దారి దోపుడుగాండ్రు మెండుగా ఉండిరట. అనేకుల ప్రాణ, ధనముల గొనుచు ప్రజలకు మిక్కిలి పీడ గలిగించుచున్న యా దొంగలను బహు ప్రయత్నమున వెంకటాద్రినాయుడు నూర్గురను పట్టి తెప్పించి వరుసగా నిలువబెట్టి తలలు నరుక తలారుల కాజ్ఞ యిచ్చెనట. ఒక కొననుండి నరుక ప్రారంభింపబోగా నచ్చటివాండ్రు అటు నుండి కొట్టుకొనుచు రమ్మని కోరిరట. కొందరిని నరికిన తర్వాతనేని జాలి వొడమక పోదని దలచిరి. కాని నాయుడుగారు అందరిని నరికించి ప్రజలకు చోరభీతి మాన్పిరట.' (చాటుపద్య మణిమంజరి)

మనము సమీక్షించు కాలములో ఆంధ్రులవేషా లెట్లుండెనను విషయము మనకంతగా తెలియకున్నను ఈనాడు మారుమూలలలో నుండే ముసలివారికి 300 ఏండ్ల క్రిందటి వారికి అంతబేదము లేకుండెనని చెప్పవచ్చును. ఇప్పుడు క్రాపులు, జుట్లు, అంగీలు, కోట్లు, సెల్లాలు టోపీలు ఎక్కువైనవి. ఆ కాలములో పురుషులు విశేషముగా గుండు రుమాలనో లేక వంకర పాగల (షమ్లావంటి చుంగుకల మెలికల లపేటాల) నో కట్టుకొనుచుండిరి. అంగీలు చాలా తక్కువ. కాని అవి ఆచారములోనికి వచ్చియుండెను. బొందెలముళ్ళు 6 తావుల వేసి అంగీలుతొడుగు చుండిరి. వాటినే బారాబందీ అనిరి. అది అపభ్రంశమై బాదరబందీ అయ్యెను.