పుట:Andrulasangikach025988mbp.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీ.శ. 17-వ లేక 18-వ శతాబ్దములో నుండి యుండును.

ఆకాలములోని ఆంధ్రమందలి బ్రాహ్మణుల స్థితిగతులను గూర్చి వెంకటాధ్వరి తన విశ్వగుణాదర్శమం దిట్లు వ్రాసెను.

"ఈ ఆంధ్రదేశములో ఒక్కొక యూరియందు శూద్రుడు గ్రామాధి కారి (యజమానుడు) గాను, వాని ప్రక్కన బ్రాహ్మణుడు భృత్యుడై గణకవృత్తిని (కరణము పనిని) అవలంబించి నాడు, నీరులేనిచోట తటాకమువలె వేదాధ్యాపకుడొక్కడే ఉన్నను ఇక్కడ వాడు మురికి పాత్రలు తోమెడి పనిలో నియమింపబడి యున్నాడు.' ఈ వాక్యముల వల్ల అ కాలములో రెడ్డి, కమ్మ మున్నగు జాతులవారు గ్రామాధికారు లని ఆరువేల నియోగులు వారికి లో బడినవారై కరణీకాలు చేయచుండిరనియు, వైదిక బ్రాహ్మణులు (ఇప్పటి మంథేనలోని పలువురు వలె) వంటలు చేయుచు జీవించుచుండిరనియు కవి అభిప్రాయముగా కనబడుచున్నది.

'ఆంధ్రదేశస్థులగు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయరు. వేదాలు చదువరు. అయినా ఈ దేశములో దేవతాభక్తి, బ్రాహ్మణపోషణ బాగా కలదు' అనియు, 'ఇక్కడి బ్రాహ్మణులు గోదావరీ స్నానముచేసి ఇసుక లింగములో శివుని ధ్యానించి తిలాక్షతసుమముల తోను, బిల్వపత్రాలతోను పూజలు సేతురు' అనియు, 'గోదావరీతీర బ్రాహ్మణులు శివపూజలు చేసి వేదాధ్యయనముచేసి పరిశుద్ధులైనవా' రనియు, కృష్ణగోదావరీ మధ్య దేశ వాసులగు వైదికులు యజ్ఞ యాగాలుచేసి ఉత్తమజీవితముల గడుపుచున్నా" రనియు అతడు వర్ణించి యున్నాడు.

వెంకటాధ్వరికాలమువరకే ఇంగ్లీషువారు మద్రాసులో బలపడి తమ వ్యాపారమును బాగుగా వృద్ధిచేసి తమ యధీనములోనున్న మద్రాసులో న్యాయస్థాన మేర్పాటుచేసిన ముచ్చటను అతడు ఇట్లు వర్ణించినాడు.

'తిరువళిక్కేణి ప్రసిద్ధమగు క్షేత్రము. దానిని పార్థసారథిక్షేత్రమనిరి. ధానినే కైరవిణి (తెల్లకలువకొలను) అన్నారు. (బహుశ: అప్పుడు పార్థసారథి కొలనులో తెల్లకలువ లుండెనేమో ? ఇప్పుడు అందు నాచు, మురికిక్రిములు నిండియున్నవి.) తిరువళిక్కేణిలో ఇంగ్లీషువారి ప్రాబల్య ముండెను'. హూణులలో అనగా ఇంగ్లీషువారిలో చెడ్డగుణా లేవనగా :-