పుట:Andrulasangikach025988mbp.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశమునకు మూడవ మూలయగు తిరుపతిలోకూడ ముసల్మానుల అక్రమాలు జరుగగా ఇదేకాలమున 'శత్రుసంహార వేంకటాచల విహార' యని ఒకశతకములో వడ్డికాసుల వెంకన్నను ఒకకవి చీవాట్లు పెట్టెనట: ఈ విషయాలను చూడగా ఈ కాలములో ఆంధ్ర దేశ మెంతటి దిక్కులేని దేశమై, అరాచకమునకు గురియై, ఎంతటి ఆవేదన పడెనో ఊహించుకొనవలెను.

ఉత్తరమునుండి తెనుగుదేశముమీదికి కష్టపరంపరలు ఒకదిక్కు దిగుమతికాగా, దక్షిణ దిక్కులో మరొకమూలనుండి ఇంకొక ఈతిబాద ప్రారంభ మయ్యెను. అది సముద్రాంతరమునుండి ఎగుమతి చేయబడి నట్టిది. అదే క్రైస్తవ మతస్థుల దౌర్జన్యము. తంజావూరును ఆంధ్రరాజులు పాలించెడు కాలము వరకే పోర్చుగీసువారు కాలికట్టులో కొలదిగా ప్రబలులై కాలుసాపి తీరమంతయు వ్యాపించుకొని కత్తితో కాక తుపాకీ గుండ్లతో క్రైస్తవ మత ప్రచారము ప్రారంభించిరి. ఆదిలో తంజావూరు రాజగు చెవ్వప్ప నాయకుడు పోర్చుగీసు వారికి ఆశ్రయ మిచ్చెను. క్రమముగా పోర్చుగీసువారు తమ దౌర్జన్యము సాగించిరి.

వారితోపాటు డచ్చివారు (హాలెండు దేశమువారు) తంజావూరు రాజ్యమునందలి జనులను పట్టుకొనిపోయి విదేశాలలో బానిసలుగా అమ్ముకొనిరి. ఇంతేకాక ముసల్మానులుకూడ తంజావూరు నాక్రమించుకొని దేశమునంతయు బీభత్సము పట్టించి, ప్రజల చంపి దోపిడులు చేసిరి. ఇదంతయు రంగీలా రాజగు విజయరాఘవ నాయకుని (అనగా క్రీ.శ. 1633-1673) కాలములో జరిగెను. ఈ పిచ్చివిజయరాఘవుడే తురకసైన్యముపై జపించిన తులసితీర్థము చల్లితే వారు భస్మమగుదురని దానిని పంపెనట. కాని అతడే సమూలముగా స్త్రీ శిశు సమేతముగా నాశనమయ్యెను.

అట్టి పిరికి కాలములో ఒక్క రాచవారు మాత్రమే ఆంధ్రుల కీర్తిని నిలువ బెట్టిరి. వారు కత్తులతోనే శత్రువులపై బడి తాము నిశ్శేషముగా హతమగువరకు పోరాడి వీరస్వర్గ మలంకరించిరి. (చూ. తంజావూరాంధ్ర నాయక చరిత్ర. కు॥

సీతారామయ్యగారు.)

అట్టి సన్నివేశములలో అనగా తురక, క్రైస్తవుల విజృంభణ కాలములో ఆంధ్రదేశమును రక్షించినది రాజులు కారు; తత్త్వబోధకులే రక్షించినవారు. దేశమంతటా వేదాంతులు బయలుదేరి గేయాలతో మతావేశమును కలిగించుచు