పుట:Andrulasangikach025988mbp.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6వ ప్రకరణము

క్రీ.శ. 1600 నుండి 1757 వరకు

విజయనగర పతనముతో అనగా క్రీ.శ. 1630 తో ఆంధ్రుల పతనము పరిపూర్తి యయ్యెను. హిందువుల పతనమునకు ముసల్మానుల విజృంభణమునకుగల కారణములు ఆయా సందర్బములందు ఇంతకుపూర్వపు ప్రకరణములందు నిరూపితములయినవి. విన్సెంటు స్మిత్‌గారు తమ ఆక్సుఫర్డ్ ఇండియా చరిత్రలో ఈ విషయమునే చర్చించెను. అతని భావములు నేను నిరూపించిన భావములతో సమానము లగుటచే నీ సందర్బమున వాటిని ఉదహరింతును.

మలిక్ కాఫిర్ దక్షిణమున మధురవరకు ఎత్తిన జండాను దించకుండా రాజ్యాలను జయించుతూ వెళ్లెను. అంతకన్న నాశ్చర్య జనక మగున దేమనగా మహమ్మద్ ఖిల్జీ అను సేనాని 200 మంది సవార్లతోనే బిహారును క్రీ.శ. 1197 లో జయించెను. అంతకన్నను ఆశ్చర్యకరమయిన విషయ మేమన ఆ సేనానియే 1199 లో 18 మందు సవార్లతోనే బెంగాలు రాజధానియగు నడియాపై బడగా వంగరాజు తొంగిచూడకయే దిడ్డితలుపునబడి పారిపోయెను. ఆ కాలములో బిహార్, బెంగాల్ రాజులును విశేషముగా బౌద్ధులు అహింసా ధర్మము వారి నీగతికి తెచ్చెను. హిందూ బౌద్ధుల పతన మత్యంత లజ్జాకరమని యొప్పుకొనక తప్పదు. ఖిల్జీ సుల్తానులు, బహమనీ సుల్తానులు లక్షల హిదువులను ఈగలనువలె చంపిరి. ఫిరోజిషా అను బహమనీ సుల్తాను 20,000 హిందువులను చంపుట పరిపూర్తియైనప్పుడంతయు మూడుదినములు చంపుడు విందు చేసెడివాడు. ఒకతడవ అయిదు లక్షల హిందువుల ప్రాణాల తీసిన తర్వాతనే "రోజా" (ఉపవాస వ్రతమును) వదలెను. లక్షల హిందువులు ప్రాణాలు దక్కించుకొన ముసల్మానులైరి. దీని కంతయు కారణమేమి? స్మిత్ గారిట్లు వ్రాసిరి.