పుట:Andrulasangikach025988mbp.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చింతాకు ముడుగుతరి :- (శుక. 1-533) మునిమాపు అని సందర్బార్థము. చింతాకు ముడుగుట అను ప్రయోగము కవి లోకానుభవమును, విశిష్టతను తెలుపును.

బడాపగలజూచి :- (శుక. 1-516) అదేపనిగా చూచి అని యర్థమిచ్చును. బహుశా ఇది బిగాబిగలయై యుండును.

సబ్బిణి :- (తెలియలేని సబ్బిణుల్ మీరు-శుక. 4-42) ఏమి తెలియని తిక్కవారు అని యర్థము.

ఏనుగుదిన్న వెలగ :- (నిరంకుశోపాఖ్యానం పుట 35) సుమతిశతకమందును ఇదే యుపమానము కలదు. ఇది సరిగా తోచదు. 'గజభుక్త కపిత్థవత్‌' అని 'గజమంటే ఒక క్రిమిజాతి' అని ఆ శ్లోకాన్ని ఉదాహరించినవారు వ్యాఖ్యానించినారు. ఇచ్చట అదే అర్థము తీసుకొనవలెను.

బొమ్మకట్టుట :- శత్రువులను అవమానించుటను బొమ్మకట్టుట లేక బొమ్మ పెట్టుట యందురు. ఈ యాచారము తెనుగు దేశములో ఎట్లు సృష్టియయ్యెనో చెప్ప జాలము. భారత కవిత్రయమువా రీపదమును ప్రయోగించినట్లు కానరాద్పు తిక్కనను ఎర్రాప్రెగడకును మధ్యకాలమం దుండిన నాచన సోమన మొద లీ బొమ్మకట్టుటను తెలిపినవాడను కొందును. 'పంతముతో దొహరమున బట్టుదు; పాసిక బొమ్మకట్టుదున్‌' (ఉ.హ. వంశము. 3-117) బొమ్మకట్టు ఆచారము రెడ్డి వెలమ రాజుల కాలములో విరివియైపోయినట్లు కానవచ్చును.[1] నేటికిని ఈ యాచారము తెనుగువారిలో నిలిచియున్నది. ఈ యాచారమును శ్రీనాథుడు స్పష్టముగా కాశీఖండములో (పీఠికాపద్యాలు 45) తెలిపినాడు.

  1. ఈ గ్రంథ ప్రథమ ముద్రణములో దీనిని పేర్కొనియుండలేదు. ముద్రితమైన తర్వాత ఒక గారడివారిగుంపును చూచితిని. వారిలో నొకడు వరిగడ్డి పగ్గమునకు కోడిరక్తమును పూసి దానిని గట్టిగాచేసి దాని కొనను కుడి కాలికి ఎంటుగా కట్టి ఆ పగ్గమును మెడపై త్రిప్పివేసుకొని యుండెను. కుడి మోకాలివద్ద ఆ పగ్గాని కొక బొమ్మను కట్టియుండెను. అదేమన అది లోభి బొమ్మ యనియు తమకు కట్టడిమాటమేరకియ్యనియరి అపకీర్తిని ప్రకటించుట కీబొమ్మను కట్టినామనిరి.