పుట:Andrulasangikach025988mbp.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుటకు సరిపోయెడిది. (శుక. 2-381) చిట్టిపావును, చటాకులో నర్థమును చిట్టెడందురు. మానికలు, తూములు, ఇరుసలు, ఖండి (పుట్టి) అనునవియు వాడుకలో నుండెను. "ఇనుపకట్ల మానియింతలు" ధాన్యంకొలతలకు వాడిరి. (శుక. 2-360)

శుకసప్తతిలో ఆడిదము, ఖండా, కత్తి, దునేదారి, బాకు, జముదాడి, రాబా, అను ఖడ్గబేదములను తెలిపినారు. దునేదారికటారి (శుక. 2-364) అన రెండు దిక్కుల ధారకల (ద్విధారా) ఖడ్గమై యుండును.

పంచాయతి సభలు

తమిళదేశమందు క్రీ.శ. 800 నుండి పంచాయతి సభలు గ్రామగ్రామమందు స్థిరపడి యుండెను కులంవివాదాలు, సంఘసంస్కారపు కట్టుబాట్లు, నేరముల విచారణ, పన్నుల వసూళ్ళు గ్రామముఖ్యులే చేయుచుండిరి. ఏడాది కొకమారు గ్రామస్థు లందరును చేరి పెద్దల నెన్నుకొనుచుండిరి. వారే అన్ని తీర్పులకును ఆధారభూతులు. అ పద్ధతులే తెనుగుసీమలోనూ క్రమక్రమముగా బలపడెను. తెనుగు సీమలో ఎన్నికలు మాత్రమున్నట్లు కానరాదు. తలార్లు అపరాదులను పట్టెడివారు. రాత్రి వారు గ్రామమందు కోలదివిటీలతో సంచారము (గస్తు) చేసెడివారు. రాత్రి తప్పెట (తముకు) వేసిన తరువాత జనులు తిరుగాడ కూడదు. అనుమాన మున్నవారిని రాత్రియంతయు తమ ఠానాలో బండకొయ్య తగిలించి కూర్చోబెట్టి తెల్లవారినతర్వాత వాడు "అచ్చో, ముచ్చో" తేల్చుకొని అపరాధి కాకున్న వదలివేసెడివారు. (శుక. 3-204) వెండి బంగారు దొంగతనమైతే మొట్టమొదట తలార్లు కమసాలివారిని పట్టి విచారించి వారికి దొంగసొత్తులు వచ్చిన తెల్పుడని యొప్పించెడివారు.

         'కందును రాగియు వెండియు
          గాంచనమును మౌక్తికాదికములగు మణులున్
          పంచాణము వారిండ్లకు
          గొంచక కొనవత్తు రమ్ముకొనుటకు చోరుల్.'[1]

అందరికంటే ధనికుడు తీర్థస్థలాలలో నుండు దేవుడు. అతని సొత్తులు పలుమారు దొంగతనమయ్యెడివి అప్పుడు:

  1. వైజయంతి. 4-73.