పుట:Andrulasangikach025988mbp.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "ఈడము, వళంద బందర, యింగిలీషు కళము, మొదలైన పేటల
          గౌరలెల్ల సౌరభ ద్రవ్యములు బేరసారమాడ బిలువనంపిరి తమతమ
          పేటలకును"

ఈ పద్యములో మొదటిపంక్తినిబట్టి శుకసప్తతిలోని మొదటి పద్యపాఠ మిట్లు దిద్దుకోవలెను. (కళము అన కొల్లం (Kollam) మలబారు తీరముది) ఈళము, వళందయును, బంగారము మొదలైన పేరుగల దీవులలో" - 'ళ' 'డ'కు భేదములేదు. ఇచ్చట 'ల'కు ప్రాస కుదురవలెను. కాన ఈడెమునకు మారు ఈళము అని వ్రాసినాడు. కవిత్వము కాన ఈళమును ఈళ కూడా చేసినాడు. అయితే ఈ సవరణలోని విశేషమేమి ? మనకు వాటిజాడ కొంతవరకు తెలియవస్తున్నది. ఈడము అనగా ఏడన్ (Aden) అను అరేబియా రేవు అచ్చటినుండి బహు ప్రాచీనమునుండి దక్షిణాపథ తీరాలలో వ్యాపారము సాగుతుండెను. వళండ అనగా హాలెండు దేశము. ఆ దేశమువారిని డచ్చివారందురు. వారు ఇంగ్లీషువారికంటె ఫ్రెంచివారికంటె ముందు మన తీరాలను తగులుతూ విశేషముగా ఇండొనీషియా దీవులలో వ్యాపారము చేసిరి. అచ్చటి అంబాయినాలో ఇంగ్లీషు వర్తకులను వధింపగా, ఇంగ్లీషుపీడ మనదేశానికి వచ్చెను. డచ్చివారిని మనవారు వళందులన్నందున వారిదేశము వళంద దేశమని కదిరీపతి అన్నాడు. కదిరీపతికి ఈడము, వళంద అంటే తెలిసియుండును. అతన్ని అనుకరించిన నారాయణ కవికి తెలియకపోవచ్చును. కాని అతనిపాఠము మనకు చాలా సహాయపడినది. శుకసప్తతి తప్పుపాఠాలను సరిచూచువారు హంసవింశతిని బాగా చదివి దృష్టిలో నుంచుకోవలెను. శుకసప్తతి రెండవ పంక్తి అట్లే యుంచవలెను. అందలి పైగోవ అనగా పెగూ దేశము.

కోమట్లే కాక 'గుత్తగొల్లలు' కూడా కొంత వ్యాపారము చేసిరి. (శుక. 1-175) పటలాంశుకములు (శుక. 3-7) దిగుమతి యయ్యెను. పటల శబ్దానికి నిఘంటువులలో ఇంటికప్పు, నేత్రరోగము, పరివారము, బొట్టు అని యర్థాలిచ్చినారు. ఇవి సరిపోవు. అంశుకమన వస్త్రములుకాన పటలాంశుకములన ఒకవిధమగు వస్త్రమను నర్థము కావలెను. శబ్దకల్పద్రుమములో పటలమునకు పరిచ్చదము (కప్పుకొను వస్త్రము) అని యర్థము వ్రాసినారు. అదిచ్చట సరిపోవును. తెనుగు నిఘంటుకారులు దానిని ఇంటికప్పునకు మాత్రమే అన్వయించినారు. పన్నీరునకు పర్షియా దేశమే ముఖ్య స్థానము. ఆ దేశమే గులాబీ పూలకు