పుట:Andrulasangikach025988mbp.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. ఆంధ్ర వాచస్పత్యములో ఒక విదమగు బంగారు అని వ్రాసినారు. కట్టాణి అను అయిదు బంగారుగుండ్ల అయిదు వరుసలుకల కంఠాభరణమును ఇప్పటికిని వాడుదురు. అదే విధముగా కంఠహారముగా వాడు ముత్యాలను కట్టాణి ముత్యాలందురు) కాశ్మీరపు కుంకుమపూవు, మలయగిరినుండి శ్రీగంధము, ఓడలపై వచ్చిన పోకలు (అనగా జవా, సుమిత్రాదీవులనుండి వచ్చినవి). గోవ (రేవులో దిగిన) తేజీలు, దిగుమతి యగుచుండెను.

ఇవిగాక రత్నాలు, ముత్యాలు, ఏనుగులు, కస్తూరి, సపరపువెంట్రుకలు, జవ్వాది, గాజుబుడ్లలో పన్నీరు, పంచలోహాలతో చేసిన ఫిరంగులు, వెండి, పట్టుబట్టతో చేసిన విసనకర్రలు, కొల్లారుబండ్లు, పింగాణి విండ్లు, రాతిపిడుల బాకులు, చలువరాతి గిన్నెలు, బానిసలుగా కొన్న యువతులు మున్నగునవికూడా దిగుమతి యయ్యెను.[1] (స్త్రీలను విదేశాల నుండి కొని తెచ్చుటనుగూర్చి ఇతర కవులును తెలిపినారు.) పాదరసము, జాజికాయ, యింగువ, లవంగాలు, పంచలవణాలు, గంధకము, కొచ్చి వేపులు (కుక్కలు) కూడా దిగుమతియయ్యెను.[2] వ్యాపారులు బేరాలకు వెళ్ళినప్పుడు బెత్తపు బుట్టలు, ఇతర పరికరాలు, గూడారాలు తీసుకొని వెళ్ళిరి.[3]. 'ఈళయు, నిళిందము, బంగాళ యు మొదలైన పేర్లు గల దీవుల' నుండియు సరకులు దిగుతుండెను. (శుక. 1-176) ఈళయు, విళింగయు అనియు నొకపాఠము కలదు. శుకసప్తతిలో మరొకచోట 'ఈళయు, ముమ్మెంగియు, బంగాళము, పైగోవ మొదలుగా బొదలెడు ద్వీపావళి' (3-7) అని వ్రాసినారు. ఈ రెండు పద్యాలలోని పాఠము తప్పుగా కానవస్తున్నది. శుకసప్తతికారుని తర్వాత 200 ఏండ్లకు అయ్యలరాజు నారాయణామాత్యుడను కవి హంసవింశతిని రచించెను. అందతడు అమాంతముగా శుకసప్తతిలోని పంక్తులు, పద్యాలు, భావాలు, విధానాలు అన్నీ స్వీకరిస్తూ వచ్చినారు. కావున పై పద్యాలకు సమానమగు పద్యము హంసవింశతిలో దొరకిన మనము సరియగు పాఠమును నిర్ణయించుకోవచ్చును. హంసవింశతి ప్రథమాశ్వాసములో 112 వ పద్యమిట్లున్నది:-

  1. శుకసప్తతి. 1-222 (ఈ రగడలో కొన్నిపదాలు నిఘంటుకారులకు తెలియక నుదాహరించినవారు కారు.)
  2. శు. 1-192.
  3. శు. 1-389