పుట:Andrulasangikach025988mbp.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లౌకిక వ్యవహార కోవిదులుగాను, విప్రులుగాను నుండవలెను. అట్టివారిని రాజు నియమింపవలెను. వారు కాని, లేక వారి సహాయముతో రాజు కాని వివాదముల పరిష్కరించుచు, పంచాయతీ సభలో అట్టివారు అయిదుగురు కాని, ఏడుగురు కాని యుండవలెను. కులీనులుగా, శీలవంతులుగా, ధనికులుగా, వయోధికులుగా, ఆమత్సరులుగానుండు వైశ్యులును సభ్యులుగా నుండవచ్చును. సభాపతిగా అర్థశాస్త్ర విశారదుడు, లౌకికజ్ఞాని, ప్రాడ్వివాకుడు, ఇంగితజ్ఞుడు, ఊహాపోహ విజ్ఞాని, అయిన బ్రాహ్మణుడు నియుక్తుడు కావలెను. ఆతడే ప్రాడ్వివాకుడు (జడ్జి) అనబడును. రాజు లేని కాలమం దతడే విచారణ కర్త. విప్రుని ఆభావములో కులీనుడగు నితరు నేర్పాటుచేయవచ్చును. ఎవరినైనను సభాపతిగా చేయవచ్చును కాని ఎన్నటికిని శూద్రుని చేయరాదు!

అభియోగములు (కేసులు) రెండు విధాలు కలవి. ఋణదానము (అప్పులు), నిక్షేపములు, అస్వామిక విక్రయములు, ఉంకువలు, వాటి అపహరణములు, జీతమియ్యకపోవుట, క్రయవిక్రయ వివాదములు, స్వామిభృత్య వివాదములు, సీమావివాదములు, వాక్పారుష్యం (అవమానకరమగు తిట్లు), దండపారుష్యం, దొంగతనము, స్త్రీ సంగ్రహణము, దాయభాగము, జూదము ఇట్టి వన్నియు పంచాయతీలో విచారింపబడుచు వాది సభ్యుల యెదుట నిలబడగా - నీకేమి బాధ, నిర్బయముగా చెప్పుము - అని వారడుగుదురు. వాని అభియోగము విని ప్రత్యర్థిని (ప్రతివాదిని) పిలిపింతురు. వాడు రోగియై లేక యితరములగు ఇబ్బందులలో నుండిన సభకు రాకుండుట దూష్యముకాదు. కులీనులను, పరభార్యలను, యువతులను, ప్రసూతికలను, రజస్వలలను సభకు పిలిపించరాదు. అర్థిప్రత్యర్థి వాదములను విని సభవారు వాటిని వ్రాయింతురు. వాటికేమి సాక్ష్యములు కలవని విచారింతురు. ఈ విచారణ స్మృతిశాస్త్రాను సారముగా నుండవలెను. ఒక వేళ సాక్షులు లేకుండిన అవసరమగుచో "దివ్యము" ఇయ్యవలెను. అనగా అగ్నిపరీక్షల వంటివి చేయింతురు. హత్యచేసిన వారికి వదాదండ మిత్తురు. అంతకు తక్కువగు నేరములకు చేదదండము నిత్తురు, అనగా చెవులు, ముక్కు. వ్రేళ్ళు, కాళ్ళు, నాలుక మున్నగునవి నరికించుట, చిన్న నేరములకు క్లేశదండ మిత్తురు. అనగా బెత్తముతో కొట్టుట, కఠినముగా మందలించుట వంటివి. అర్థహరణమునకు 200 నుండి 1000 పణముల వరకు ద్రవ్యదండము నిత్తురు. ఈ విధముగా న్యాయ విచారణ జరుగును.

(అభి. 1. ప్ర. 2 అధ్యా)