పుట:Andrulasangikach025988mbp.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ కాలమందు గ్రామాలకు పంచాయతి సభ లుండెను. ఆ పెద్దలే పన్ను వసూలు చేసెడివారు. గ్రామ తలార్లే పోలీసువారు. న్యాయ స్థానాలు పంచాయతీ సభలే:

వ్యవసాయకులు పశుల తలుగులకుగాను మర్రియూడలను గూడ తెచ్చి త్రాళ్ళు వేసెడివారు.

         'ఈ రీతి నుండి యొకనా డారెడ్డన పసికి దలుగు లమరించుటకై
          నారలు గావలెనని పొరుగూరికినై పోయె మర్రియూడలు దేవన్‌'[1]

వ్యవసాయకులలో ముఖ్యులు రెడ్లు. సాధారణపు రెడ్లు స్వయముగా 'చేని పాటుపడి' పండించేవారు. మధ్యాహ్నము వరకు శ్రమించి 'యింటి కేగుదెంచిన తరి దాలి తోకపయి చేర్చిన కాగుల నీటి'తో స్నానం చేసి 'బొడ్డు గిన్నెలో రాగిసంకటి' తినేవారు,[2] వ్యవసాయకుకు పాడియు బాగా ఉండెడిది. అమావాస్యలందు సేద్యములు చేయకుండిరి. (రుక్మాంగద 2-43). నేటికిని అనేక ప్రాంతాలలో ఈ ఆచారమున్నది.

వ్యాపారాన్ని ప్రధానముగా కోమట్లే సాగించెడివారు. ఇంతకు పూర్వము అరబ్బులు, ఈరానీలు, చీనావారు, బర్మా, మలయా, పెగూ, కాంబోడియా, ఇండోనీషియా, సింహళము వారు మన దేశముతో వ్యాపారం చేసిరి. కృష్ణరాయల కాలములో పోర్చుగీసువారు దిగిరి. ఈ సమీక్షా కాలములో ఫ్రెంచి (పరాసులు, పరంగీలు), ఇంగిలీషులు కూడా దిగిరి. వారితో మన బేరులు బేరాలు చేసిరి. 'ఇంగిలీషుల ముఖాములు' (వ్యాపారస్థానాలు), 'విచిత్ర వేష భాషాభిరాములగు పరంగుల' ముఖాములును సముద్ర తీరాలలో నుండెనని కదిరీపతి మొదటి కథ తెలిపినాడు. ఏయే దేశాలనుండి యేయే వస్తువులు దిగుమతి యగుచుండెనో మనకు చాలావరకు తెలియవచ్చినవి. తెలిదీవి(?) నుండి పద్మరాగములు, ఈళా దేశమునుండి నీలములు, మక్కానుండి తివాసులు, షీరాజ్ (ఈరాను భాగం) నుండి వచ్చిన సిరాజులు (కత్తులు), 'అల్లనేరేడు వాగు జలముల నైన యవి యపరంజి లప్పలు (జంబూ ద్వీపము అనగా కాశ్మీరములోని జమ్మానుండి వచ్చిన బంగారు), కట్టాణి పూసలు (కట్టాణి శ.ర.నిఘంటువులో

  1. శుక సప్తతి. 2-338.
  2. శుక సప్తతి. 2-335.