పుట:Andrulasangikach025988mbp.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాబోలు. అంతేకాక చతుశ్శాల, త్రిశాల, ద్విశాల, ఏకశాల అను భేధాలతో నిండ్లు కట్టుచుండిరి. చతుశ్శాలతో చతుర్ద్వారములతో గూడిన యింటిని సర్వతోభద్రమనిరి. అటులే నంద్యావర్తం, వర్ధమానం, స్వస్తికం, రుచికం మున్నగు పేరులు గల యిండ్లుండెను. ఇండ్లు కట్టుటలో చేయ వలసిన విధులు ఇండ్లు పూర్తియైన తర్వాత చేయవలసిన వాస్తుపూజాదికములు విపులముగా వర్ణింపబడినవి. శ్రీరామచంద్రుడు పర్ణకుటిని నిర్మించు కొన్నప్పుడు ఒక జింకను గృహాధిదేవతకు బలియిచ్చెను. ఇప్పు డా యాచారము బ్రహ్మణేతరుల లోనే కానవచ్చును.

(అభి. ప్ర. 1. అధ్యా 3)

నేరములను, వివాదములను, విచారించుటకై పంచాయతీ సభ లేర్పాటై యుండెను. ఇది అతిప్రాచీన భారతీయ సంప్రదాయము. ఇదే నిజమైన ప్రజా ప్రభుత్వము. ప్రపంచ రాజనీతిలో పంచాయతితో సమాన మైనది మరొకటి సృష్టికాలేదు, ఇంగ్లీషు కోర్టులు వచ్చిన తర్వాతనే లా పేచీలు, ఖానూను చిక్కులు, బారీకులు, తర్కకుతర్కాలు, కూటసాక్ష్యాలు అప్రమాణాలు, అబద్ధాలు, పారమందెను. ఆ విషయాన్నే 1858 విప్లవములో బందీయైన తుది డిల్లీపాదుషాయగు బహదూరుషా ఇట్లు కవనము చెప్పెను.

    రహ్తేథె ఇన్‌ముల్క్‌మే పీరోవలీషాంషో ఖమర్
    జబ్ ఘుసీఫౌజేన సారా హర్‌వలీ జాతారహా॥

"ఈ దేశమందు మునులు, ఋసులు సూర్యచంద్రులు ప్రకాశమానులై యుండిరి. కాని ఇంగ్లీషువారి సేన లీ దేశమందు జొరబడగానే సత్పురుషు లందరును మాయమైపోయిరి.

ముందు ప్రకరణాలలో పంచాయతులను గూర్చి వివరింతును. ఇందు పశ్చిమ చాళుక్యరాజు తన రాజ్యమందలి పంచాయతీసభల దృష్టిలో నుంచుకొని తన యభిలషితార్థ చింతామణిలో వ్రాసినవి సంగ్రహముగా తెలుపుదును.

"పంచాయతీ సభలోని సభ్యులుగా నుండదగినవారు వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞులుగాను, సత్యసంధులుగాను, ధార్మికులుగాను, మిత్రామిత్రులందు సమదృష్టికలవారుగాను, ధీరులుగాను, అలోలుపులుగాను, పలుకుబడి కలవారుగాను,