పుట:Andrulasangikach025988mbp.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందురు. జుట్లకు దండగా పలుతాయెతులు చేర్చి కట్టుకొనుట యనుటచే అదొక యాభరణ విశేష మయ్యెనో యేమో స్పష్టము కాదు. రాజుల వేటసాధనాలు పెక్కు.

          "వలలు సురుల్ సిడుల్ పిసులు వంకరదుడ్డులు పదిపోట్లు దీ
           ములు గొరకల్ తెరల్ జిగురు మోకులు బోనులు కాలియుర్లు బొం
           గులు మిడివిండ్లు బండగులు కొమ్ములు పాదులు వల్లెత్రాళ్ళు చి
           వ్వలతడికెల్ ధరించి యిరువంకలు జేరిరి కొంద రుద్దతిన్."

జింకలకు కొమ్ముటురులు పెట్టి తీసుకొని పోయిరి డేగలను తీసుకొని పోయిరి. పుట్టదెందు, చింబోతులు, తుపాకి, తుటారి, లకోరి మున్నగు పేరులు గల వేటకుక్కల వెంట నుంచిరి. వేటవేషాలతో ఆయుధాలతో రాజు, పరివారము బయలుదేరెను.[1](సాంబోపాఖ్యాన మందును ఇట్టి వర్ణనలు కలవు. చూడుడు ఆశ్వాసము 2, పద్యము 3 నుండి 25 వరకు.) శుకసప్తతిలో (రెండవ కథలో ) వేటను చాలా విపులముగా వర్ణించిరి. అభిలాషులు చూచుకొన గలరు.

         "మ్రోసెన్ గడియారమున మహాసంకులరవముగాగ యామద్వయ సం
          ఖ్యాసూచక ఘంటాధ్వని వాసర మదకేసరి ప్రవరగర్జితమై." [2]

అనుటచే గడియారాల ఆచారము విరివిగా నుండెనని తెలియవచ్చును. వైష్ణవాచారులకు అరవ పదవాసన, తిరుపదపూర్వకత, యొక విశిష్టత నాటికిని నేటికిని కలదు. భోజనము చేసినప్పుడు అన్న మనక సాదము అని, పరమాన్న మనక తిరుకణామధు అని, భక్ష్యాలు అనక తిరుపణార్యము అని ఈ విధముగా అన్నియు అరవముతోనే అడుగవలెను. లేకున్న వైష్ణవుడు మైలపడి పోవును. ఇది వైష్ణవము తెచ్చి పెట్టిన అరవ దాన్యము!

         "తిరుకట్టె సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్
          తిరువంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్."

  1. చంద్రభాను(?) 2-21-24.
  2. సాంబోపాఖ్యానము. 2-48