పుట:Andrulasangikach025988mbp.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాటము త్రిప్పెడివారు. వారు నొక్కు పూసల వేరు, కుందనపుకమ్మలు, నాను, కడియములు, చుట్టుమెట్టెలజోడు, కెంపురవలయుంగరము, వెండికుప్పెసౌరము ధరించి, కురుమాపు కూనలమ్మ చీర కట్టి, కుడిపైటలోపల సిస్తురవిక తొడిగెడివారు.[1]. (కూనలమ్మ చీర=ఈ పదము నిఘంటువులలో లేదు. పిల్లలులేని గొడ్రాండ్రు కూనలమ్మ (కూనలిచ్చు దేవతకు) ఎర్రంచుకల తెల్లనిచీరను నైవేద్య మిచ్చి కొలిచి ఆ చీరను కట్టుకొనెడివారు. ఆ చీరను కూనలమ్మచీర యందురు. ఇది రాయలసీమలోని యాచారమై యుండెను. వైజయంతీవిలాసములో "కూనలమ్మ పటంబు" అని వర్ణించుటచే తెలంగాణమందు కూడా యీ ఆచార ముండె ననవలెను. (వైజ. 3-100.)

"కుడిపైటలోపలి సిస్తురవిక" అనుటలో చాలా యర్థమున్నది. రెడ్లలో మోటాటిస్త్రీలు కుడిబుజముమీదికి కొంగు వేసుకొందురు. పాకనాటివారు ఎడమ బుజము మీద వేసుకొందురు. ఇప్పుడు మోటాటి వారుకూడా ఎడమపైట వేసుకొందురు. పూర్వము కుడియెడమపైటల పట్టింపు చాలా యుండెను. చాలా యేండ్లక్రిందట కుడి యెడమపైటల వారికి పోట్లాటలు జరిగి, మద్రాసు హైకోర్టులో తీర్పు చేయించుకొనిరి. శుకసప్తతిలోని రెడ్డిస్త్రీ మోటాటిదని అర్థమగును.

రాటమును బ్రాహ్మణులు తప్ప తక్కిన వారంద రా కాలములో వడికినవారే. అందు రెడ్లు ప్రత్తిపండించేవారుకాన ప్రధానముగా ఇంటింట తప్పక మధ్యాహ్నములందు వడికేవారు. స్త్రీలు మాత్రమే వడికిరి. (గాంధీయుగమందే పురుషులున్నూ వడికిరి.) పదారింటి తరము (16 Count) దారము వడికిరి.

          "వడి దారము చెవులుం, ద్రొక్కుడుపలకయు,
           దిండు, కుదురు, గుంజలునుం, ద్రొ
           క్కుడుబొమ్మయును, ద్రిప్పుడు పుడుకయునుం
           గలుగు రాట్నములు గైకొనుచున్.
           ఎడమదెస దొడ్డుగా వైచి యేకు లెల్ల
           గెలిన పలువగ వేపుడుగింజ లునిచి
           చేవపీటలమీద నాసీనలైన వారలై
           వావి వరుసలు వదిరికొనుచు."

  1. శుక 2-40-411.